కలం, వెబ్డెస్క్: మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం సర్వసాధారణంగా మారిపోయింది. ఇంట్లో వస్తువులను భద్రపరుచుకునే డబ్బాల దగ్గరి నుంచి స్కూళ్లు, ఆఫీసులకు తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ వరకు ప్లాస్టిక్ తో ముడిపడి ఉంది. వీటిలో మనం అధికంగా వాడేవి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ (Plastic Water Bottles). ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు కూల్ వాటర్ కోసం ఫ్రిజ్ లో రకరకాల ప్లాస్టిక్ బాటిళ్లను నింపి ఉంచుతుంటాం. అయితే, మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే .. మనం వాడే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లు ఒకే రకమైనవి కావు. అదే విధంగా అన్ని బాటిళ్లు ఆరోగ్యానికి సురక్షితం కూడా కాదు.
నిజానికి మనం వాడే ప్లాస్టిక్ బాటిల్ వెనుక ఒక నంబర్ ఉండటం మీరెప్పుడైనా గమనించారా? బాటిల్ అడుగు భాగంలో త్రిభుజం గుర్తు ఉండి అందులో 1 నుండి 7 వరకు అంకెలు కనిపిస్తాయి. వీటిని ‘రైసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్’ అంటారని చెబుతున్నారు నిపుణులు. ఈ నంబర్స్ బాటిల్ గురించి కీలక సమాచారాన్ని మనకు తెలియజేస్తాయి. అంటే బాటిల్ తయారీలో ఉపయోగించిన ప్లాస్టిక్ రకం ఎలాంటి, అది ఎన్ని రోజులు వాడొచ్చు అనేది సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు.
నంబర్ 1 (PET): 1 నంబర్ ఉన్న బాటిల్ కేవలం ఒక్కసారి మాత్రమే వాడాలి. ఎండలో ఉంచితే వీటి నుండి హానికరమైన రసాయనాలు నీటిలో కలుస్తాయి. అవి తాగడం తాగడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుంది.
నంబర్ 2, 4, 5: ఈ నంబర్ కోడ్ గల బాటిళ్లు ఇతర ప్లాస్టిక్ లతో పోలిస్తే సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. వీటిలో నంబర్ 2.. ఈ బాటిల్ చాలా గట్టిగా, మందంగా ఉంటుంది. దీని నుంచి రసాయనాలు నీటిలో కలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. నంబర్ 4.. ఈ ప్లాస్టిక్ కొద్దిగా మెత్తగా వంగే గుణం కలిగి ఉంటుంది. ఇది మనం వాడే పౌచ్ లు, కొన్ని రకాల రీ యూజబుల్ బాటిళ్లలో ఉపయోగిస్తారు. నంబర్ 5.. ప్లాస్టిక్ రకాలన్నింటిలోనూ ఇది అత్యంత సురక్షితమైనదిగా చెబుతారు నిపుణులు. మనం ఇంట్లో వాడే లంచ్ బాక్సులు, చిన్న పిల్లల పాల బాటిళ్లు దీనితోనే తయారు చేస్తారు.
నంబర్ 3, 6, 7: ఇవి అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ రకాలుగా పరిగణిస్తారు. దీని తయారీలో వాడే రసాయనాలు మానవ హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయట
ప్లాస్టిక్ బాటిళ్ల ఎంపిక ఎంత ముఖ్యమో.. వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేయడం కూడా అంతకంటే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది బాటిళ్లను శుభ్రం చేయకుండానే పదే పదే ఉపయోగిస్తుంటారు. దీనివల్ల బాటిళ్లలో తేమ, మురికి, గాలిలోని దుమ్ము కారణంగా కంటికి కనిపించని ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు పేరుకుపోతాయి. కాబట్టి రోజూ ఉపయోగించే వాటర్ బాటిళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం తప్పనిసరి.
మనం వాడే బాటిల్ కలర్ చేంజ్ అయినా, అందులో నుండి బ్యాడ్ స్మెల్ వస్తున్నా.. ఆ బాటిల్ కాలపరిమితి ముగిసిందని అర్థం. అలాంటప్పుడు వెంటనే బాటిల్ ను మార్చడం మంచిదని చెబుతున్నారు. ఎంత నాణ్యమైన, బలమైన ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే.. దానిని శాశ్వతంగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. వీటికి బదులుగా స్టెయిన్ లెస్ స్టీల్,రాగి లేదా గాజు బాటిళ్లను ఉపయోగించడం బెస్ట్.

