కలం, వెబ్ డెస్క్: ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్లకు అధికారమిచ్చారని.. రెండున్నరేళ్లకే ఎందుకు అసెంబ్లీని రద్దు చేయాలని ప్రశ్నంచారు. రెండుకాళ్లు లేనివాడు చూసుకుందాం రా.. అని సవాలు విసిరినట్లే బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులను జీర్ణించుకోలేకే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు.
బీజేపీవి పగటి కలలు..
అధికారంలోకి వస్తామని బిజేపీ పగటికలలు కంటోందని పొంగులేటి దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ రాని పార్టీ అధికారం గురించి ఆశ పడుతోందని ఎద్దేవా చేశారు. ఆశ ఉండడంలో తప్పులేదు కానీ ఆ పార్టీ అత్యాశకు పోతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ధర్మల్ పవర్ ప్లాంట్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని అడిగితే బిజేపీ ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. ఈ సారి రైతు భరోసా నిధులను అనుకున్నదానికంటే రెండు మూడు రోజుల ముందే వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో జమచేస్తామని చెప్పుకొచ్చారు.

