కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 5,000 కాదు.. 19 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ చౌరస్తాలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులతో కలిసి కవిత ధర్నా నిర్వహించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని.. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని.. జప్ఫా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలోనే భట్టి, డీజీపీ చెప్పారు..
కానిస్టేబుల్ ఉద్యోగాలు 19 వేలకు పైగా వేస్తామని చెప్పి 5 వేలు మాత్రమే ఇస్తామనటం చాలా అన్యాయమని ఫైర్ అయ్యారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 19 వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారని.. డీజీపీ కూడా అదే మాట అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నామని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లు కావాలని పట్టుబట్టిన వారిలో తాను ఒకరినని అన్నారు. కానిస్టేబుల్స్ కు 36, ఎస్సై ఉద్యోగాలకు 38 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.
మూసీ ప్రక్షాళన ఎవరు అడిగారు?
రూ.7 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ ప్రక్షాళన చేయమని ఎవరు అడిగారు? అని కవిత ఫైర్ అయ్యారు పేద వాళ్ల ఇళ్లను తొలగిస్తూ ఆ ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కచ్చితంగా నిరుద్యోగులే రేవంత్ రెడ్డిని గద్దె దించుతారని విమర్శించారు. జులై 2 రోజున నిరుద్యోగులు సచివాలయం ముట్టడి చేస్తామని అంటున్నారని.. అదే రోజు తాము ఉద్యమకారులతో భూపోరాటం కార్యక్రమం చేస్తున్నామన్నారు. అవసరమైతే ఉద్యమకారులమంతా కూడా నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

