కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ ఎత్తున ఖమ్మం జిల్లా మధిర (Madhira) నియోజకవర్గంలో తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు వరుణుడు బ్రేక్ వేశాడు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో, వానాకాలం సీజన్‌కు సంబంధించిన సుమారు రూ. 9 వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు అంతా సిద్ధమైన తరుణంలో ఎడతెరిపి లేని వర్షాలు అధికార యంత్రాంగం అంచనాలను తలకిందులు చేశాయి.
అయితే, ప్రతికూల వాతావరణం ఎదురైనప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. మధిర బహిరంగ సభ రద్దు కావడంతో, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మారుస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఒకే వేదికపై నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఖమ్మం జిల్లాను వేదికగా ఎంచుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షల మంది రైతులను సమీకరించేలా చింతకాని మండలంలో 30 ఎకరాల్లో భారీ సభా ప్రాంగణాన్ని, వాహనాల నిలిపివేత కోసం ఏకంగా 150 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
వర్ష సూచనల నేపథ్యంలో భారీ వ్యయంతో కూడిన వాటర్ ప్రూఫ్ జర్మన్ షెడ్లను, హెలీప్యాడ్లను కూడా నిర్మించారు. అయితే, గత రెండు రోజులుగా కురుస్తున్న నిరంతరాయ వర్షాలు, ఆదివారం సాయంత్రం కురిసిన భారీ ముసురుకు జర్మన్ షెడ్లు వేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. సభా ప్రాంగణం, రైతులు నడిచే దారులు, ముఖ్యంగా పార్కింగ్ స్థలం పూర్తిగా బురదమయంగా మారాయి. డోజర్లు, రోలర్లతో మట్టిని చదును చేసే ప్రయత్నం చేసినా, వర్షం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకపోవడంతో పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. చివరకు భారీ ఈదురుగాలులకు టెంట్లు కూడా కూలిపోవడంతో పరిస్థితి చేదాటిపోయింది. లక్షలాది మంది తరలివచ్చే ఈ సభలో బురదలో వాహనాలు చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అంచనా వేసిన పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సభను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ, రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఒకవేళ వాతావరణం అనుకూలించే వరకు సభను వాయిదా వేస్తే రైతు భరోసా నిధుల పంపిణీ ఆలస్యమై రైతులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన తక్షణమే ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మారుస్తూ, మంగళవారం సాయంత్రం 4 గంటలకే నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ నిర్ణయంతో మధిరలో ప్రత్యక్షంగా జరగాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడు డిజిటల్ రూపం సంతరించుకుంది. హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ తమ పరిధిలోని ‘రైతు వేదికల’ ద్వారా డిజిటల్ పద్ధతిలో ఈ సమావేశంలో భాగస్వాములు కానున్నారు.
జర్మన్ షెడ్లు, ఇతర ఏర్పాట్ల కోసం భారీగా వ్యయం చేసినప్పటికీ, ప్రజా భద్రతకు పీఠం వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధ్యతాయుతమైన పాలనకు అద్దం పడుతోందనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మధిర ప్రజలకు ఈ భారీ బహిరంగ సభ రద్దు కావడం కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, సాంకేతికత సాయంతో సకాలంలో అందబోతున్న ‘రైతు భరోసా’ పంపిణీ అన్నదాతల ఇళ్లల్లో వానాకాలం వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు. కాగా రైతు ఆశీర్వాద సభ ను జూలై ఫస్ట్ వీక్ లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే నెల రెండో తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్ లో అధికారికంగా ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

