Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికతో అభివృద్ధికి పునాది : దేవసేన

కలం, జనగామ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బలమైన పునాది వేసిందని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన (Devasena) అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం తో కలిసి ఆమె 99 రోజుల కార్యాచరణ అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. ఈ సందర్భంగా దేవసేన మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామ, వార్డు స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించే వ్యవస్థ బలోపేతమైందన్నారు.

ఇదే స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడంతో పాటు ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం పెంచాలని ఆదేశించారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, గ్రామాలు, పట్టణాల్లో తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా నిర్వహించాలని సూచించారు.

విద్యారంగంలో జిల్లాలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను అభినందించిన ఆమె.. నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న ఆన్ అకాడమీ తరగతులు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధ (AI)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఐకేపీ సంఘాల ద్వారా ఎరువుల దుకాణాల నిర్వహణతో మహిళా సంఘాలకు ఆదాయం పెరగడంతో పాటు రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతున్నాయని పేర్కొన్నారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేశామని తెలిపారు. ఈ-ఆఫీస్ ద్వారా 10 వేల ఫైళ్ల పరిష్కారం, 500కుపైగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల అమలు, ఆరు గ్యారంటీల అమలు, ప్రజావాణి దరఖాస్తుల త్వరిత పరిష్కారం, ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఈ-ఆఫీస్ అమలు, అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, గ్యాస్ స్టవ్‌లపై మధ్యాహ్న భోజన వంట, పరిశుభ్రత కార్యక్రమాలు, పాత ఫైళ్ల క్లియరెన్స్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>