కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఓటరు జాబితాల కచ్చితత్వం కోసం చేపట్టనున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్-SIR) ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో సర్ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ నెల 25 నుంచి జులై 24 వరకు..
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నట్లు ఆమె తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఈ నెల 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్ – 6 అందజేస్తున్నారని, ఆయా పత్రాలను ఓటర్లు పూరించి మళ్ళీ బీఎల్వోలకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు ఇస్తేనే ఓటరు జాబితాలో ఉంటారని, ఇవ్వకపోతే ఓటరు జాబితాలో ఉండరని ఆమె స్పష్టం చేశారు.
ప్రతీ మంగళవారం మండల స్థాయిలో సమీక్ష..
ఇక నుంచి ప్రతీ మంగళవారం మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని, తర్వాత ఏఈఆర్వో స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ తమ బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్వోలకు సహకరించే విధంగా చూడాలని సూచించారు. వారానికి ఒకసారి నిర్వహించే సమావేశానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పక హాజరు కావాలని కోరారు. సర్ ప్రక్రియకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అన్ మ్యాపింగ్ కేసుల విచారణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడదని.. కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తీసుకున్న ఎన్యూమరేషన్ పత్రాలను కచ్చితంగా పూరించి ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే మాత్రం ఓటరు జాబితాలో వాళ్ళ పేర్లు ఉండవు అని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజ్యలక్ష్మీ, సీసెక్షన్ అధికారిణి జయసుధ, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

