Mobile Popup Ad
Mobile Popup Ad

ఆదివాసీల అభివృద్ధే బీజేపీ లక్ష్యం : నితిన్ నబీన్​

కలం, హనుమకొండ : ఆదివాసీల అభివృద్ధి బీజేపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) అన్నారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు, తెలంగాణ రాజకీయాలు, నక్సలిజం, ఆదివాసీల అభివృద్ధి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

గిరిజన యువతకు విద్య, ఉపాధి ద్వారా మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. దేశంలో నక్సలిజానికి ఇక చోటు ఉండదని స్పష్టం చేసిన ఆయన (Nitin Nabin), కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కట్టుబడి ఉందన్నారు. బస్తర్ ప్రాంతంలో ఇంకా కొంతమంది నక్సలైట్లు ఉన్నప్పటికీ, వారిని కూడా త్వరలో పూర్తిగా ఏరివేస్తామని తెలిపారు. నక్సలిజం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, శాంతి భద్రతలతో పాటు అభివృద్ధిని కూడా ప్రభుత్వం సమాంతరంగా తీసుకెళ్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాజకీయాలపై స్పందించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇప్పటికీ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని, ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, దేశ అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.

దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలమైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నితిన్ నబీన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>