Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్తగూడెంలో శరవేగంగా ‘యంగ్ ఇండియా స్కూల్’ పనులు: కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: ​ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ కొత్తగూడెం నియోజకవర్గానికి కీర్తి పతాక అని, ఈ స్కూల్ ఏర్పాటుతో జిల్లా కేంద్రం ఒక గొప్ప విద్యా హబ్‌గా మారబోతోందని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులను సోమవారం ఆయన అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకూ ఒకే క్యాంపస్‌లో నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ ఆలోచన ఎంతో అభినందనీయమన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కింద కొత్తగూడెం క్యాంపస్‌లో సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత అత్యాధునిక హంగులతో పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 25.475 ఎకరాల భారీ విస్తీర్ణంలో, 5,38,246 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో అకాడమిక్ బ్లాక్, జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, డైనింగ్, కిచెన్‌లతో పాటు సిబ్బంది కోసం క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికే ఈ సరికొత్త స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

​ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, సైన్స్ ల్యాబ్‌లు, 5 వేలకు పైగా పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ కోర్టులను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని వెల్లడించారు. పర్యావరణ హితంగా ఉండేలా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సౌర, పవన విద్యుత్ వ్యవస్థలను, నీటి సంరక్షణ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను ఇక్కడ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

​నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, ఇప్పటికే రోడ్లు, బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీలు, ఔటర్ రింగు రోడ్లు కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్నింటికీ మంజూరు లభించిందని తెలిపారు. అన్ని కులాలవారికి 17 కమ్యూనిటీహాళ్లు మంజూరు చేశామని, ఎయిర్‌పోర్టు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్రీడామైదానాలు, జిమ్ వంటివి ఏర్పాటు కాబోతున్నాయని వివరిస్తూ, నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ​ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>