కలం, వెబ్‌డెస్క్: పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు, భావాలు, బాధ్యతలు కలిసి ఒక కొత్తజీవితాన్ని మొదలు పెట్టడం. అయితే పెళ్లైన కొత్తలో వివాహ బంధం చాలా సాఫీగా సాగిపోతుంది. అన్నీ కొత్తగా, అందంగా కనిపిస్తాయి. కానీ కాలక్రమంలో కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక బాధ్యతలు, పిల్లలు వంటి కారణాలతో దంపతులు మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలు వస్తుంటాయి.
సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. కానీ తరచూ ఇలా గొవడపడటం వల్ల మనసుల మధ్య దూరాలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఏ విషయంలో గొడవలు వస్తున్నాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలి (Relationship Tips) అనే విషయాలపై దంపతులు దృష్టి పెడితే బంధం బలపడుతుందని చెబుతున్నారు నిపుణులు. నిపుణులు అభిప్రాయం ప్రకారం..
సమస్యపై దృష్టి పెట్టడం
సాధారణంగా దంపతుల మధ్య గొడవ జరిగినప్పుడు వారు సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. కానీ కొంత మంది సమస్యను వదిలేసి భాగస్వామిని తప్పుబడతారు. ఇలా చేయడం వలన అపార్థాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఇలాంటప్పుడే దంపతులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలు అంటే ఒకరితో ఒకరు పోటీపడేవారు కాదని, ఇద్దరు కలిసి సమస్యను ఎదుర్కోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనివల్ల అనేక గొడవలు తగ్గిపోతాయి.
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం
గొడవ జరినప్పుడు కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవడం అవసరం. ఎందుకంటే కోపంలో చెప్పిన మాటలు మీ భాగస్వామి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. అందుకే గొడవ పెరిగినప్పుడు ఒకరితో ఒకరు వాదించకుండా కాస్త విరామం తీసుకోవాలి. లోతుగా శ్వాస తీసుకోవాలి. మనసు కుదుట పడిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
అర్థం చేసుకోవడం
మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గొవడ జరినప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు మాని అర్థం చేసుకోవాలి. “నువ్వు ఎప్పుడూ ఇలానే చేస్తావు లేదా దీనికి కారణం నువ్వే” అనే మాటలు బంధాన్ని మరింత దెబ్బతీస్తాయి. అందుకే దానికి బదులుగా ” ఇలా జరిగినపుడు నాకు చాలా బాధ అనిపించింది, నువ్వు అలా మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది” అని మన బాధను ప్రశాంతంగా వారితో పంచుకోవాలి. ఇలా మాట్లాడితే భాగస్వామి కూడా మీ మనసును అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
సమయం కేటాయించడం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరితో ఒకరు నాణ్యమైన సమయం గడపకపోవడం కూడా గొడవలకు కారణం కావచ్చు. కాబట్టి ఎంత బిజీగా ఉన్న ఒకరికి ఒకరు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించండి.
ప్రేమ అనేది ఒక్క క్షణంలో పుట్టే ఆకర్షణ మాత్రమే కాదు, అది కాలంలో పాటు ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్మించుకునే ఒక అందమైన నమ్మకం. ప్రతిరోజూ చూపించే గౌరవం, ఓపిక, నమ్మకం, పరస్పర అర్థం చేసుకోవడం వల్ల అది మరింత బలపడుతుంది. మీ సంబంధంలో గొడవలు ఎక్కువవుతున్నాయని అనిపిస్తే, ముందుగా మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న మార్పులు, స్పష్టమైన సంభాషణ, కలిసి గడిపే సమయం మీ దాంపత్య జీవితాన్ని మరింత ఆనందంగా, సంతోషంగా మార్చగలవు.

