కలం, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) రెండో రోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. టూరిజం ప్లాజాలో నగరంలోని పలు వ్యాపారవేత్తలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. మరికాసేపట్లో వీబీఐటీ కాలేజీకి వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో జరిగే కాంక్లేవ్‌లో పాల్గొంటారు. వివిధ అంశాలపై వారితో చర్చించి, అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు.
భద్రకాళి అమ్మవారి దర్శనం..
అనంతరం వరంగల్ నగరానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు భద్రకాళి అమ్మవారిని నితిన్ నబిన్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 2.30 గంటలకు గిరిజన నేతలతో హరిత కాకతీయ హోటల్ లో సమావేశమవుతారు. మోదీ ప్రభుత్వం గిరిజనులకు ఇస్తున్న ప్రాధాన్యతను వారికి వివరించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఉమ్మడి వరంగల్ బూత్ అధ్యక్షులతో సమావేశం అవుతారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం, వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తారు. రాాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో ఆఫీస్ బేరర్లతో ప్రత్యేక సమావేశం అవుతారు.
కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం..
రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నితిన్ నబిన్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా పార్టీ నేతలు లేవనెత్తుతున్న అంశాలతో పాటు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు, నేతలను ఎలా సన్నద్ధం చేయాలో సమాలోచనలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని.. కలిసికట్టుగా కష్టపడితే అది అసాధ్యం కాదని నితిన్ నబిన్ స్పష్టం చేసినట్లు సమాచారం.

