కలం, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక కాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలతో ఎంతో బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారు తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని చెబుతున్నారు వైద్యులు. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంలో హార్మోన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. యుక్తవయసు నుంచి గర్భధారణ, డెలివరీ, మెనోపాజ్ దశల వరకు ప్రతీ దశలో హార్మోన్లలో మార్పులు రావడం సహజమే. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత (Hormone Imbalance) సమస్యతో బాధపడుతున్నారు. అయితే మహిళలు తెలియక చేసే ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సరైన నిద్ర లేకపోవడం
మనిషికి ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. కానీ రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం, మొబైల్ చూడటం వల్ల నాణ్యమైన నిద్ర కరువవుతుంది. నిద్ర సరిపోక పోతే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే మహిళలకు సరైన నిద్ర చాలా అవసరం.
2. మానసిక ఒత్తిడి
కుటుంబ నిర్వహణ, ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీనివలన మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, PCOS/PCOD, ఇరెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు వస్తాయి.
3. జంక్ ఫుడ్, చక్కెర అధికంగా తీసుకోవడం
ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉండే మహిళలు వంట చేసుకునే సమయం లేక జంక్ ఫుడ్ తింటున్నారు. ప్యాక్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తింటే ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అంతే కాకుండా బరువు పెరగడం, PCOS వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఇంట్లో వండిన ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం చాలా అవసరం.
4. పోషకాహార లోపం
హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే శరీరానికి పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకోవాలి. కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12, ఒమేగా-3, మెగ్నీషియం వంటి పోషకాలు లోపిస్తే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజూ ఆకుకూరలు, పెరుగు, పండ్లు, నట్స్, విత్తనాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
5. తగినంత నీరు తాగకపోవడం
నీరు తక్కువగా తీసుకోవడం వలన శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. అప్పుడు హార్మోన్ల పనితీరు ప్రభావితం అవుతుంది. ఫలితంగా చర్మ సమస్యలు, అలసట, ఇరెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
6. శారీరక శ్రమ లేకపోవడం
నేటి డిజిటల్ యుగంలో గంటల తరబడి కంప్యూటర్ల మందు కూర్చోవడం వలన శారీరక శ్రమ కరువైపోయింది. ఇలా రోజంతా కూర్చునే జీవనశైలి వల్ల ఇన్సులిన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల పనితీరు బలహీనపడుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వాకింగ్, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం హార్మోన్ల సమతుల్యతకు మేలు చేస్తుంది.
7. వేళకు తినకపోవడం
బరువు పెరుగుతున్నామని లేదా ఇతర కారణాల వల్ల కొంత మంది భోజనం మానేస్తుంటారు. భోజనం మానేయడం, ఆలస్యంగా తినడం, తరచూ బయట ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారుతాయి. ఇవి హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. అందుకే నిర్ణీత సమయానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడే మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సరైన నిద్ర, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నీరు, ఒత్తిడి నియంత్రణ వంటి మంచి అలవాట్లను పాటించడం ద్వారా హార్మోన్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

