Mobile Popup Ad
Mobile Popup Ad

సింగిరేణికి బాకీ.. సర్కారే డిఫాల్టర్!

కలం, తెలంగాణ బ్యూరో: ఒక్క క్షణం ఆటంకం లేకుండా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేశామని నాడు బీఆర్ఎస్ (BRS) సర్కార్ చెప్పేది.. అదే మాట నేడు కాంగ్రెస్ (Congress) సర్కారూ చెప్తున్నది. కానీ, ఈ వెలుగుల వెనుక సింగరేణి కోల్​ మైన్స్​ లిమిటెడ్ ​(Singareni) నల్ల బంగారం (బొగ్గు) పాత్ర గణనీయం. అయితే.. ఆ బొగ్గును సింగరేణి నుంచి కొనుక్కుంటున్న తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో కంపెనీలు సకాలంలో పేమెంట్ చేయడంలేదు. ఫలితంగా సింగరేణిపై ఆర్థిక భారం పెరిగిపోతున్నది.

రాష్ట్రం ఏర్పడే నాటికి సింగరేణికి జెన్‌కో (Genco), ట్రాన్స్‌కో (Transco) కంపెనీలు రూ.3 వేల కోట్లు మాత్రమే బకాయి ఉంటే.. పన్నెండేండ్లలో అది పన్నెండు రెట్లు పెరిగి రూ.36 వేల కోట్లు దాటిపోయింది. బీఆర్ఎస్ రెండు టర్ముల పాలన ముగిసే నాటికి రెండు సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొత్తం రూ.20,924 కోట్లు.. కాంగ్రెస్ వచ్చాక మరో 15వేల కోట్లు పెరిగింది.

సింగరేణి, జెన్కో, ట్రాన్స్‌కో.. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలే. అయినా స్వరాష్ట్రంలో ఆ మూడూ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. సింగరేణికి ఇతర రాష్ట్రాల సంస్థలు టైమ్‌కు చెల్లింపులు జరుపుతున్నా తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో మాత్రం డిఫాల్టర్లుగా మారాయి. ఆ రెండు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక.. ఆ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా నల్ల బంగారం గనుల్లో సమస్యలు ముసురుకుంటున్నాయి.

ప్రైవేటు కంపెనీలకు బొగ్గు విక్రయించడానికి ముందుగానే పేమెంట్ చేసే విధానం సింగరేణిలో (Singareni) అమలవుతున్నా తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో సంస్థలకు ఆ నిబంధన లేకపోవడంతో ఏటేటా బకాయిలు పేరుకుపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో దాదాపు 64 శాతం థర్మల్ వాటానే. ఇందుకోసం ప్రతీ సంవత్సరం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో సంస్థలు సింగరేణి నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. పేమెంట్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నాయి. కారణం.. ప్రభుత్వం నుంచి తమకు చెల్లింపులు జరగడం లేదన్నది ఆ విద్యుత్ సంస్థల వాదన.

బీఆర్ఎస్ సెకండ్ టర్ము నుంచి ఇదే కథ!

రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఫస్ట్ టర్ములో పేమెంట్ సక్రమంగానే జరిగినా సెకండ్ టర్ము నుంచి సింగరేణి కట్టాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది మరింత ఎక్కువైంది.
– బీఆర్ఎస్ ఫస్ట్ టర్ము చివరినాటికి సింగరేణికి బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి జెన్‌కో చెల్లించాల్సిన బకాయిలు కేవలం రూ.660 కోట్లే. సెకండ్ టర్ము చివరి నాటికి అది 12 రెట్లు పెరిగి రూ. 8 వేల కోట్లు దాటిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేండ్లలో పేమెంట్ నామమాత్రంగానే జరగడంతో చివరికి అంతా కలిపి ఈ ఏడాది జూన్ నాటికి రూ. 21 వేల కోట్లు దాటిపోయింది.
– సింగరేణికి తెలంగాణ ట్రాన్స్ కో చెల్లించాల్సింది బీఆర్ఎస్ ఫస్ట్ టర్ము చివరి నాటికి రూ.3,464 కోట్లు ఉంటే.. సెకండ్ టర్ము ముగిసే నాటికి అది రూ.12,868 కోట్లకు చేరుకున్నది. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అంతా కలిపి రూ. 14,818 కోట్లు అయింది.

ఇతర రాష్ట్రాల బకాయిలు తక్కువే

ప్రేవేటు సంస్థలకు పేమెంట్ చేసిన తర్వాతనే బొగ్గును సరఫరా చేయడం సింగరేణి కంపెనీ ఒక విధానంగానే పెట్టుకున్నది. దీంతో ప్రైవేటు కంపెనీల నుంచి బకాయిలు ఉండే అవకాశం లేదు. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో కంపెనీలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర విద్యుత్ కంపెనీలకు కూడా సింగరేణి బొగ్గును సరఫరా చేస్తూ ఉన్నది. సింగరేణికి వసూలు కావాల్సిన బొగ్గు బకాయిలు ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం రూ.38,508 కోట్లు కాగా.. ఇందులో 95% తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో కంపెనీలవే! ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలతోపాటు, ఎన్టీపీసీ చెల్లించాల్సిన బకాయిలు రెండు వేల కోట్ల లోపే.

– తమిళనాడులోని ‘టాన్‌జెడ్కో’ (తమిళనాడు ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) బకాయిల కంటే ఎక్కువే చెల్లించింది. వచ్చే సంవత్సరానికి సర్దుబాటు చేసుకునేలా కొంత అమౌంట్ సింగరేణి దగ్గరే ‘మిగులు’గా (సర్‌ప్లస్) ఉన్నది.

బీఆర్ఎస్ బాకీ రూ.20వేల కోట్లపైనే!

రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణికి జెన్‌కో చెల్లించాల్సిన మొత్తం 1,958 కోట్లు మాత్రమే. ట్రాన్స్‌కోని కూడా కలిపితే రెండు విద్యుత్ సంస్థలు ఆరోజుకు చెల్లించాల్సిన బాకీ మొత్తం రూ.3 వేల కోట్లు. రెండు టర్ముల బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి రెండు సంస్థలు సింగరేణికి చెల్లించాలని మొత్తం రూ.20,924 కోట్లు. ఇందులో జెన్‌కో చెల్లించాల్సింది రూ. 8,056 కోట్లు, ట్రాన్స్‌కో చెల్లించాల్సింది రూ.12,868 కోట్లు!!

కాంగ్రెస్ పాలనలో మరో 15 వేల కోట్లు పెరిగి..!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన మొత్తం రూ.20,924 కోట్లు ఉంటే.. ఇప్పుడు రెండున్నరేండ్ల పాలనలో అది దాదాపు మరో 15 వేల కోట్లు పెరిగి.. రూ.36 వేల కోట్లకు బాకీ ఎగబాకింది. రెండున్నరేండ్లలో జెన్‌కో చెల్లించాల్సిన రూ.13,533.73 కోట్లు కాగా, ట్రాన్స్‌కో బకాయి పడింది రూ.1,949.77 కోట్లు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పేమెంట్ చేసింది నామమాత్రమే.

ఆ రెండు శాఖలు డిప్యూటీ సీఎం వద్దే!

– విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే సింగరేణికి టైమ్ ప్రకారం నిధులు విడుదల చేయాల్సిన ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరే ఉన్నది. అయినా.. తెలంగాణ విద్యుత్ సంస్థలే సింగరేణికి అతిపెద్ద బకాయిదారులుగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో బకాయిలు దాదాపు 1.7 రెట్లు పెరిగాయి.
– దేశంలోనే అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో ఒకటైన సింగరేణికి ఉత్పత్తిలోగానీ, విక్రయాల్లోగానీ ఇబ్బందులు లేకపోయినా వసూళ్ల విషయంలో మాత్రం చిక్కులు ఎదుర్కొంటున్నది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తున్నా వాటి నుంచి రావాల్సిన చెల్లింపులు మాత్రం ఏటేటా పెరుగుతున్నాయి. సంస్థపై ఆర్థిక భారం పడుతున్నది.
– సర్‌చార్జి, పెనాల్టీ కలిపి సింగరేణికి (Singareni) తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో కంపెనీలు భారీగానే బాకీ పడ్డాయి. ప్రభుత్వ విద్యుత్ అవసరాలకు ఆటంకం లేకుండా బొగ్గు సరఫరాను నిరంతరాయంగా కొనసాగిస్తున్నా భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోవడం సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నది.

సింగరేణికి వసూలు కావాల్సిన బకాయిలు : (2026 జూన్ నాటికి)

తెలంగాణ జెన్‌కో – రూ.21,589.73 కోట్లు
తెలంగాణ ట్రాన్స్‌ కో – రూ.14,818.38 కోట్లు
ఏపీ జెన్‌కో – రూ. 1,354.91 కోట్లు (ఆంధ్రప్రదేశ్)
కేపీసీఎల్ – రూ. 613.32 కోట్లు (కర్నాటక)
మహా జెన్‌కో – రూ. 96.19 కోట్లు (మహారాష్ట్ర)
ఎన్‌టీపీసీ – రూ. 35.23 కోట్లు

సింగరేణికి (Singareni) తెలంగాణ జెన్‌కో బకాయిలు ఇలా : (రూ. కోట్లల్లో..)

2014-15 1,958
2015-16 2,301
2016-17 781
2017-18 660
2018-19 1,235
2019-20 2,202.48
2020-21 2,773.09
2021-22 4,840.27
2022-23 3,126.24
2023-24 8,056
2024-25 14,532.39
2025-26 20,275.99
2026-27 21,589.73 (జూన్ నాటికి)

సింగరేణికి తెలంగాణ ట్రాన్స్ కో బకాయిలు ఇలా: (రూ. కోట్లల్లో..)

2016-17 1,057
2017-18 1,785
2018-19 3,464
2019-20 6,204.12
2020-21 6,218.87
2021-22 9,161.43
2022-23 12,045.73
2023-24 12,868.61
2024-25 11,945.80
2025-26 14,394.19
2026-27 14,818.38 (జూన్ నాటికి)

Read Also:  మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నారా.. ఇవే కీలకం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>