కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) గ్రూప్ దశ ముగియడంతో నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. చివరి 32 జట్లు ఖరారయ్యాయి. అయితే నాకౌట్ డ్రా చూసిన తర్వాత ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి ఒక్కసారిగా అర్జెంటీనాపైనే పడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఫైనల్ దారి చాలా సులువుగా కనిపిస్తుండగా.. మరోవైపు ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్ వంటి యూరప్ దిగ్గజాలు మాత్రం ఒకే వైపు చిక్కుకుని కఠినమైన పోరుకు సిద్ధమయ్యాయి. గ్రూప్ దశలో అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసింది.
మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఒక్క పరాజయం లేకుండా నాకౌట్‌కు చేరుకుంది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ మ్యాచ్‌కు సగటున రెండు గోల్స్ చేస్తూ జట్టును ముందుండి నడిపించాడు. 2018 ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్ కూడా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. కిలియన్ ఎంబాప్పే, ఉస్మాన్ డెంబెలే గోల్స్‌తో ఆ జట్టు దూసుకెళ్లింది. ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో కూడా గ్రూప్ దశలో మూడు విజయాలు నమోదు చేసింది.
అయితే జర్మనీకి చివరి గ్రూప్ మ్యాచ్ నిరాశ మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో కురకావోపై 7-1తో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. చివరి మ్యాచ్‌లో ఈక్వడార్ చేతిలో ఓడిపోయింది. బ్రెజిల్, పోర్చుగల్, ఇంగ్లండ్, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ కూడా గ్రూప్ దశను ఆశించిన స్థాయిలో ముగించలేకపోయాయి. ఈ టోర్నీలో అర్జెంటీనా, పోర్చుగల్ వేర్వేరు నాకౌట్ బ్రాకెట్లలో చోటు దక్కించుకోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. దీంతో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో జట్లు ఫైనల్లో తప్ప మరో దశలో తలపడే అవకాశం లేకుండా పోయింది.
అర్జెంటీనాకు సాఫీగా కనిపిస్తున్న దారి
రౌండ్ ఆఫ్-32లో అర్జెంటీనా కేప్ వెర్డేతో తలపడనుంది. ఈ వరల్డ్ కప్‌లో కేప్ వెర్డే కొన్ని సంచలన విజయాలు సాధించినా.. అర్జెంటీనాకు గట్టి సవాల్ విసరాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అర్జెంటీనా తర్వాత ఈజిప్ట్-ఆస్ట్రేలియా మ్యాచ్ విజేతతో ఆడనుంది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, కొలంబియా, ఘనా లేదా అల్జీరియాలో ఏదో ఒక జట్టు ప్రత్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగు జట్లపై కూడా అర్జెంటీనాకు మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి.
సెమీఫైనల్లో మాత్రం అసలు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. బ్రెజిల్, నార్వే, ఐవరీ కోస్ట్, ఇంగ్లండ్ జట్లలో ఏదో ఒకటి అర్జెంటీనాకు ప్రత్యర్థిగా నిలవొచ్చు. పనామా, ఈక్వడార్ కూడా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. అయినప్పటికీ సెమీస్ వరకు అర్జెంటీనాకు పెద్దగా ఒత్తిడి ఉండదనే అంచనాలు ఉన్నాయి.
యూరప్ దిగ్గజాలకు కష్టమే
నాకౌట్ డ్రాలో మరోవైపు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం వంటి బలమైన జట్లు ఒకే వైపు ఉండటంతో ప్రారంభ దశ నుంచే భారీ పోటీలు తప్పేలా లేవు. రౌండ్ ఆఫ్-16లోనే ఫ్రాన్స్-జర్మనీ తలపడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ ఫుట్‌బాల్‌లోని ఒక అగ్రజట్టు ఆరంభ నాకౌట్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. మరోవైపు పోర్చుగల్-స్పెయిన్ కూడా అదే దశలో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు జట్లలో ఒకదాని ప్రయాణం కూడా ముందుగానే ముగియనుంది. ఫైనల్‌కు చేరాలంటే యూరప్ దిగ్గజాలు ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌లాగే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

