కలం, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి చరిత్ర సృష్టించారు. శనివారం జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనే మెస్సీ ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. వరుసగా ఏడు ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా ఆయన రికార్డుకెక్కారు. అర్జెంటీనా జట్టు అప్పటికే గ్రూప్-జె లో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు జోర్డాన్ జట్టు టోర్నమెంట్ నుండి ముందే నిష్క్రమించింది.
ఈ కారణంగా ఈ మ్యాచ్‌లో మెస్సీని మొదట స్టార్టింగ్ ఎలెవన్‌లో తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేశారు. మ్యాచ్ మొదటి భాగంలో లౌటారో మార్టినెజ్ పెనాల్టీ ద్వారా అర్జెంటీనాకు తొలి గోల్ అందించారు. ఆ తర్వాత మ్యాచ్ 60వ నిమిషంలో మార్టినెజ్ స్థానంలో మెస్సీ మైదానంలోకి వచ్చారు. ఆ తర్వాత 80వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట జోర్డాన్ ఆటగాడు ఫౌల్ చేయడంతో అర్జెంటీనాకు ఫ్రీ-కిక్ లభించింది. దీనిని మెస్సీ అద్భుతమైన లో-షాట్‌తో గోల్‌గా మార్చారు.
ఆ బంతి ఇద్దరు జోర్డాన్ డిఫెండర్ల మధ్య నుంచి నెట్ ఎడమ మూలలోకి దూసుకెళ్లింది. ఈ లేట్ గోల్‌తో అర్జెంటీనా 3-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా గ్రూప్ స్టేజ్‌లో అన్ని పాయింట్లు సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. ఈ గోల్‌తో మెస్సీ పేరిట మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఇది వరల్డ్ కప్ చరిత్రలో ఆయనకు 19వ గోల్. దీనితో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తన రికార్డును ఆయనే మరింత పొడిగించుకున్నారు.
గతంలో వరుసగా ఆరు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్ లెజెండ్ జైర్జినోల రికార్డును మెస్సీ ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టారు. ఇది మెస్సీ కెరీర్‌లో 72వ ఫ్రీ-కిక్ గోల్ కాగా, అర్జెంటీనా తరఫున డైరెక్ట్ ఫ్రీ-కిక్ ద్వారా వచ్చిన 12వ గోల్. 39 ఏళ్ల మెస్సీ తన 202 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మొత్తం 123 గోల్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 145 గోల్స్‌తో క్రిస్టియానో రొనాల్డో మాత్రమే మెస్సీ కంటే ముందున్నారు.

