కలం, వెబ్ డెస్క్: జనసేన సిద్ధాంతాలను విశ్వసించి నడిచిన వారితోనే పార్టీ సంస్థాగత నిర్మాణం చేస్తామని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం జరిగిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశంలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పుష్కర కాలంపాటు తనతో నడిచి, పార్టీ సిద్ధాంతాల కోసం తపనపడిన సమూహంతో ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నానని చెప్పారు.
జనసేన అనేది నిరంతర ప్రవాహం
జనసేన (Jana Sena Party) అనేది నిరంతర ప్రవాహంలా కళ కళలాడాలని ఆకాంక్షించారు. ఓ వ్యక్తి బలమైన ఆలోచన నుంచే వ్యవస్థ తయారవుతుందని అన్నారు. తర్వాత ఆ వ్యవస్థ ఎంతోమందిని తయారు చేస్తుందని చెప్పారు. విజయాలకు, అపజయాలకు అతీతంగా కాలాన్ని ఎదురించి మరీ తనకు అండగా నిలబడిన జనసేన సమూహానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి 22 లక్షల మంది ఉద్యమిలను తయారు చేయడానికి 18 వేల మంది సాధక్స్ నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీకి భావినాయకత్వం అందించే ప్రక్రియకు జనసేన శ్రీకారం చుట్టిందని అన్నారు. కులరాజకీయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయాలకు కులాన్ని ముడిసరకుగా వాడుకోనని స్పష్టం చేశారు. అన్ని కులాల ఆమోదంతోనే చరిత్ర సృష్టించగలమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పథకం ప్రకారం సాగుతున్నాయని.. ఆ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారి నైజం మారలేదని విమర్శించారు. యువతకు ఉచితాలు కాదు.. గౌరవమైన జీవనం కావాలని చెప్పారు. సంక్షేమ పథకాలకు ఎప్పుడూ జనసేనవ్యతిరేకం కాదన్న పవన్.. ప్రతి విషయంపైనా నాయకులు బలంగా మాట్లాడాల్సిందేనన్నారు.

