కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ (Nalgonda Congress) లో బాస్ ఎవరు? పార్టీ ప్రోటోకాల్ ప్రకారం సర్వాధికారాలు కలిగిన జిల్లా అధ్యక్షుడి పదవికి అసలు విలువ ఉందా? అంటే.. క్షేత్రస్థాయి పరిణామాలు లేదనే సమాధానమే ఇస్తున్నాయి. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు సొంత పార్టీలోనే అడుగడుగునా ఘోర అవమానాలు ఎదురవుతుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల హవా ముందు జిల్లా పార్టీ బాస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారగా.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో సైతం ఆయనకు తీవ్ర పరాభవమే ఎదురైంది. ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో మళ్లీ పాత సామాజిక వర్గాల కుమ్ములాటలను, అధిష్టానం వివాదస్పద వైఖరిని తెరపైకి తెచ్చింది.
నిజానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్తున్న మాటలకు, నల్లగొండ జిల్లాలో జరుగుతున్న పరిణామాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా ఒక బీసీ నేత అయిన పున్న కైలాష్ నేత ఉండటమే ఆయనకు శాపంగా మారిందా? అనే అనుమానాలు క్యాడర్‌లో బలపడుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల అరాచకం, అణచివేత ధోరణికి డీసీసీ అధ్యక్షుడు నిలువెత్తు సాక్ష్యంగా మారుతుండటం ఆందోళనకరం. ఇతర నాయకుల చిన్న తప్పులకే షోకాజ్ నోటీసులు ఇచ్చే కాంగ్రెస్ హైకమాండ్.. నల్లగొండలో జిల్లా అధ్యక్షుడికి జరుగుతున్న వరుస అవమానాలపై ఎందుకు మౌన ముద్ర దాల్చింది? రెడ్డి సామాజికవర్గ మంత్రులను ప్రశ్నించే దమ్ము అధిష్టానానికి లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలో జరిగే ఏ అధికారిక లేదా పార్టీ కార్యక్రమాల్లోనైనా డీసీసీ అధ్యక్షుడే సుప్రీం. ఆయన ఆధ్వర్యంలోనే క్యాడర్ నడవాలి. కానీ, నల్లగొండలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అవుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే, వీటిలో ఎక్కడా జిల్లా పార్టీ బాస్ అయిన పున్న కైలాష్ నేత ఫొటో కనిపించకపోవడం స్థానికంగా పెద్ద దుమారమే రేపింది.
అధికారిక పార్టీ కార్యక్రమాల్లో కనీస ప్రోటోకాల్ పాటించకపోవడంపై కైలాష్ నేత అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నల్లగొండ నియోజకవర్గంతో పాటు మునుగోడు, ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ డీసీసీ అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేల వర్గాల హవానే నడుస్తుండటంతో, డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాట్టా.. లేనట్టా..? అనే ప్రశ్నలు సామాన్య క్యాడర్ నుంచి సైతం వస్తున్నాయి.
జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి?
ఈ వివాదం వెనుక తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్న సామాజిక సమీకరణాల చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. పున్న కైలాష్ నేత వెనుకబడిన వర్గానికి చెందిన నేత కావడం వల్లే జిల్లాలోని అగ్రవర్ణ (రెడ్డి) నాయకత్వం ఆయన్ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోందనే వాదనలు జోరందుకున్నాయి. పార్టీ కోసం కష్టపడే బీసీ నేతలకు గుర్తింపు ఎక్కడనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనో, లేదా ఇతర వ్యాఖ్యలు చేశారనో సీనియర్ నేత షబ్బీర్ అలీ వంటి వారికే షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరిన హైకమాండ్.. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడికి ఇంతటి అవమానం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్ అధిష్టానానికి లేదా? లేక దీని వెనుక మరేదైనా వ్యూహం ఉందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో అత్యంత బలమైన నేత. పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర, జిల్లాపై ఆయనకున్న పట్టు తక్కువ చేయలేం. ఇలాంటి సమయంలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రితో నేరుగా విభేదించడానికి అధిష్టానం సుముఖంగా లేదా అన్న చర్చ లేకపోలేదు. వాస్తవానికి ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించి తన వర్గీయులకు డీసీసీ అధ్యక్షుడు ఆదేశాలు పాటించాల్సిందేనని చెబితే.. పరిస్థితి సిట్ రైట్ అవుతుంది. కానీ మంత్రి కోమటిరెడ్డి ఆ దిశగా కన్పించడం లేదు.
క్యాడర్‌పై ఫుల్ ఎఫెక్ట్..
పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా కమిటీలకు, ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడికి సరైన గౌరవం దక్కకపోతే అది గ్రౌండ్ లెవెల్ క్యాడర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. రెడ్డి సామాజికవర్గానికి ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయం అనే భావన బలంగా ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్‌కు నష్టం తప్పదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే టీపీసీసీ నాయకత్వం నల్లగొండ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. డీసీసీ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్, గౌరవం దక్కేలా చూడటంతో పాటు, మంత్రులు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయం కుదిరిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. లేదంటే ఈ అసంతృప్తి రాబోయే రోజుల్లో గ్రూప్ వార్‌గా మారి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు.

