Mobile Popup Ad
Mobile Popup Ad

కొలిక్కి వచ్చిన రాయదుర్గం భూ వివాదం.. సీఎం వ్యూహంతో ఎస్బీఐ రాజీ

కలం, తెలంగాణ బ్యూరో : రాయదుర్గం భూముల వేలం వివాదం (Rayadurgam Land Dispute) లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కు తగ్గింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహంతో రాజీకొచ్చింది. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పస్ట్ టైమ్ నాలుగు రోజుల క్రితం జరిపిన చర్చల సందర్భంగా బ్యాంకు యాజమాన్యం పాజిటివ్ సిగ్నల్ పంపింది. తాజాగా శనివారం సచివాలయంలో మరోమారు జరిగిన చర్చల్లో బ్యాంకు తరఫున నిర్ణయం వెలువడింది. రెండు దఫాల చర్చల అనంతరం ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోడానికి సమ్మతి తెలిపింది.

ఇప్పటికే ఆ స్థలాన్ని చూసిన బ్యాంకు అధికారులు ఇక డైరెక్టర్లతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకోడానికి రంగం సిద్ధమైంది. చీఫ్ సెక్రటరీతో జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగియడంతో బ్యాంకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరడంతో ప్రభుత్వం పైచేయి సాధించినట్లయింది.

భూ వివాదంపై హైకోర్టుకు ఎస్బీఐ :

ప్రభుత్వం రాయదుర్గంలో ఇటీవల భూములను వేలంలో విక్రయించింది. ఎకరానికి గరిష్టంగా రూ. 237 కోట్ల ధర పలికిన భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 1,490 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో ఐదెకరాల భూమి తమదేనని, 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 13.13 కోట్లతో కొనుగోలు చేశామని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఎస్బీఐ పేర్కొన్నది. ఈ భూమిపై ప్రభుత్వానికి హక్కులు లేకపోయినా విక్రయించిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నది.

విచారణ అనంతరం మూడు వారాల పాటు మధ్యంతర స్టే విధించిన హైకోర్టు… తదుపరి చర్యలపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి, భూమిని కొనుకున్న సంస్థకు నోటీసులు జారీ చేసి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఎస్బీఐతో ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక లావాదేవీలన్నింటినీ మరో బ్యాంకులోకి మార్చుకునేలా ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించింది.

ముఖ్యమంత్రి వ్యూహంతో ఆలోచనలో పడిన ఎస్బీఐ యాజమాన్యం తరపు ప్రతినిధులు నాలుగు రోజుల క్రితం చీఫ్ సెక్రటరీతో చర్చలు జరిపారు. ప్రభుత్వ విధానాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బ్యాంకు డైరెక్టర్ల దృష్టికి ప్రతినిధులు తీసుకెళ్లారు. మరోవైపు ఎస్బీఐ తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు, రిజర్వుబ్యాంకుకు వివరిస్తామని ప్రభుత్వం ఆ చర్చల సందర్భంగా స్పష్టం చేసింది.

భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకు యాజమాన్యం రెండో దఫా చర్చల కోసం శనివారం సచివాలయానికి వచ్చి చీఫ్ సెక్రటరీతో సమావేశమైంది. ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామన్న అంగీకారాన్ని తెలిపింది. ఇక హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడమే తరువాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ వివాదం కొలిక్కి రానున్నది.

ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వైస్ చైర్మన్ శశాంక పాల్గొన్నారు. ఎస్‌బీఐ తరఫున డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జీఎస్ రాణా, తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేశ్ ద్వివేది, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పూవళగి హాజరయ్యారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>