కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆర్టీజీఎస్ పనితీరు, లక్ష్యాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ (WhatsApp Governance) సేవల వినియోగంపై ప్రజలలో మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవలు సులభంగా ప్రజలకు చేరేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
అలాగే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రేషన్ కార్డుల విభజన ప్రక్రియను మరింత సరళతరం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అభ్యర్థి ఆధార్ నంబర్ ఆధారంగా అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను డిజిటల్ విధానంలో సులభంగా ధృవీకరించే విధంగా వ్యవస్థను రూపొందించాలని అధికారులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని, ఆర్టీజీఎస్ ద్వారా అమలవుతున్న ప్రాజెక్టులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

