కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియాపై 1-0తో కీలక విజయం సాధించి తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో మెక్సికో తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆదివారం కాలిఫోర్నియాలోని ఇంగిల్‌వుడ్‌లో జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-బీ రన్నరప్ కెనడాతో తలపడనుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ హ్యూగో బ్రూస్ కూడా అరుదైన రికార్డు నెలకొల్పారు. 74 సంవత్సరాల 75 రోజుల వయసులో వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన అత్యంత వయసున్న కోచ్‌గా నిలిచారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రూస్ భావోద్వేగానికి గురయ్యారు. జట్టు లక్ష్యం గ్రూప్ దశను దాటడమేనని, అది నెరవేరడం తన కోచింగ్ జీవితంలో గుర్తుండిపోయే క్షణమని తెలిపారు. తన కెరీర్ చివరి దశలో ఇలాంటి విజయాన్ని అందుకోవడం ప్రతి కోచ్ కల అని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌లో నిర్ణయాత్మక ఘట్టం 63వ నిమిషంలో వచ్చింది. 22 ఏళ్ల థాపెలో మసేకోకు షెపాంగ్ మోరెమీ అద్భుతంగా బంతిని అందించారు. మసేకో లోపలికి కట్ చేసి ఎడమ కాలితో కొట్టిన షాట్ డిఫెండర్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి గోల్‌గా మారింది.
ఈ గోల్‌తో 22 సంవత్సరాల 225 రోజుల వయసులో ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున రెండో అత్యంత పిన్న వయస్కుడైన గోల్ స్కోరర్‌గా మసేకో నిలిచాడు. మ్యాచ్‌లో రెండు అవకాశాలు చేజార్చుకున్నా మొత్తం ఐదు షాట్లు కొట్టాడు. టోర్నీలో ఇప్పటివరకు అతని షాట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విజయంపై స్పందించిన మసేకో తన ప్రయాణంలో కలలను వదలకూడదనే సందేశాన్ని పంచుకున్నాడు.
జట్టు ప్రదర్శనపై బ్రూస్ ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్లు వ్యూహాన్ని అద్భుతంగా అమలు చేశారని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారని చెప్పారు. ప్రత్యర్థి వద్ద బంతి ఉన్నప్పుడు ఖాళీలను మూసేశామని, తమ వద్ద బంతి ఉన్నప్పుడు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నామని వివరించారు. దక్షిణాఫ్రికా టోర్నీని మెక్సికో చేతిలో 2-0 ఓటమితో ప్రారంభించింది. తర్వాత చెక్ రిపబ్లిక్‌తో 1-1 డ్రా చేసుకుంది. దీంతో దక్షిణ కొరియాపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒత్తిడిని జట్టు విజయంగా మార్చిందని బ్రూస్ తెలిపారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం, జట్టు కోసం కలిసి ఆడే తత్వం ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

