కలం, కరీంనగర్ బ్యూరో : తాగునీటి ఎద్దడిని నివారించాలని, చెరువుల కబ్జాపై సీపీఐ చేపట్టిన కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తాగునీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఖాళీ బిందెలతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం సిపిఐ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాయకులకు పోలీసులకు కొద్దిసేపు తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో ఉన్న నీటిని ప్రక్క జిల్లాలకు తరలించి కరీంనగర్ ప్రజలు తాగునీటి కష్టాలను, కన్నీళ్లను చవిచూడాల్సి వస్తుందని, కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాగునీరు, ఎండా కాలంలో ప్రజలకు నీరందక ఇబ్బందులు పడుతున్నారని, నగర వ్యాపితంగా ఎటు చూసినా, ఏ డివిజన్ కు వెళ్లినా ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో గతంలో ఉచితంగా ట్యాంకర్లను పంపించేదని ఇప్పుడు డబ్బులు ఇచ్చి నీళ్లను మునిసిపల్ నుండి కొనుక్కునే దుస్థితి రావడం సిగ్గుచేటన్నారు. ఇందుకు ప్రధాన కారణం అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వక పోవడమేనని విమర్శించారు. ఇటీవలి కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు,కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని కబ్జాలు చేస్తున్నారని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు.
ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు నగర ప్రజల తాగునీటి కష్టాలను, భూముల కబ్జాలను నిలువరించాలన్నారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు నిర్వహించక తప్పదని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మచ్చ రమేష్, శాఖ కార్యదర్శులు బాకం ఆంజనేయులు, గామినేని సత్యం చెంచల మురళి, నగునూరి రమేష్, కాల్వ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

