కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నదుల అనుసంధానం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. గంగా, గోదావరి, కావేరి నదుల అనుసంధానంతో భారత్ అగ్రాగామిగా ఎదుగుతుందని.. తద్వారా దేశం ‘అన్‌స్టాపబుల్’గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంతోనే దేశంలో నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.
మరోవైపు తుంగభద్ర డ్యామ్‌కు 70 ఏళ్ల చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్ట్ బాగుంటేనే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. నీటి సమస్యల పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తోందన్న సీఎం.. ప్రాజెక్టు 33 గేట్లు 6 నెలల్లో పునరుద్ధరించారని పేర్కొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు.సీఎం రేవంత్ రెడ్డి “డైనమిక్ లీడర్” అని, తెలంగాణ హక్కుల విషయంలో ఆయన రాజీపడరని.. అది తనకు నచ్చిందని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు పొగడ్తలు కురిపిస్తున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవ్వులు చిందించారు.

