కలం, ఖమ్మం బ్యూరో : రైతులు తమ సొంత మండల పరిధిలోనే యూరియాను సులభంగా బుక్ చేసుకునేలా బుకింగ్ యాప్ (Urea Booking App) ను త్వరలోనే అప్‌డేట్ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) తెలిపారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు మరింత సౌలభ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను సవరించి, 2 నుంచి 3 ఎకరాల విస్తీర్ణం కలిగిన చిన్న, సన్నకారు రైతులు కూడా ఈ యాప్ ద్వారా లబ్ధి పొందేలా తగిన మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ యూరియా యాప్‌ను (Urea Booking App) ఆదర్శంగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అడాప్ట్ చేసుకుంటోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ సరికొత్త సాంకేతికత వల్ల మార్కెట్లో యూరియా బ్లాక్ మార్కెట్ గణనీయంగా తగ్గుతుందని, దీనివల్ల దళారీల ప్రమేయం లేకుండా నిజమైన రైతులకు పూర్తి లబ్ధి చేకూరుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా, వారి విలువైన సమయం వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు.
యాప్ ద్వారా రైతులకు ఇన్ని ప్రయోజనాలు చేకూరుతుంటే, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకుల కడుపుతీపి ఏంటో తనకు అర్థం కావడం లేదని మంత్రి విమర్శించారు. అసలు రైతు అంటే ఏంటో, సాగు అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఆఖరికి యూరియా నల్లగా ఉంటుందో లేక తెల్లగా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు రోడ్డెక్కి రాజకీయ విమర్శలు చేస్తుంటే విడ్డూరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.
Read Also: అదిరిపోయే ఫీచర్లతో రోబోటాక్సీ కారు.. డ్రైవర్ లేకుండానే రయ్ రయ్!
Follow Us On : WhatsApp

