Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

కలం, తెలంగాణ బ్యూరో: ఒకవైపు భయపెడుతున్న ఎల్‌ నినో భూతం.. మరోవైపు పండించిన పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులు.. ఇంకోవైపు వ్యవసాయం లాభసాటిగా లేదన్న ఆందోళన.. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రెగ్యులర్‌గా పంటలు పండించుకుంటూనే అదే భూమిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా రైతులను ప్రోత్సహించేందుకు రెడీ అయింది. సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్లేట్ల కారణంగా పంటలకు ఎండ తగలడంలేదనే ఇబ్బంది రాకుండా సరికొత్త టెక్నాలజీని వాడనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐటీ-కమ్యూనికేషన్ల విభాగం, హైదరాబాద్ రీసెర్చ్-ఇన్నోవేషన్ సర్కిల్ కలిపి సంయుక్తంగా కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నాయి. త్వరలోనే అశ్వారావుపేటలో పైలట్ ప్రాజెక్టు (Agrivoltaics Pilot Project)గా దీన్ని ప్రారంభించనున్నారు. అక్కడ సక్సెస్ అయితే.. దశలవారీగా విస్తరించనున్నారు.

ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో..!

మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్, సాగర్ జిల్లాల్లో, ఢిల్లీ శివారులోని ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి) ప్రాంగణంలో, మహారాష్ట్రలోని పుణె సమీపంలోని వ్యవసాయ పొలాల్లో సోలార్ పంట తరహా పైలట్ ప్రాజెక్టులు నాలుగైదేండ్లుగా నడుస్తున్నాయి. మహారాష్ట్రలో ఓ ప్రైవేటు సంస్థ రైతులకు నిరంతరం ఈ నూతన విధానంపై అవగాహనా తరగతులు ఇస్తూ ఉన్నది.

ఇప్పుడు తెలంగాణలో సైతం అశ్వారావుపేట అగ్రికల్చరల్ కాలేజీ ప్రాంగణంలో 100 కిలోవాట్ల ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నది. పంటలకు గిట్టుబాటు ధర కోసం, పంటను అమ్ముకోడానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులకు, ఆదాయం తగ్గిపోతుందనే బాధలకు సోలార్ ఎనర్జీ ద్వారా అదనపు ఆదాయం సమకూరడం ఒకింత ఉపశమనంగా ఉండొచ్చన్నది ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న వ్యవసాయ శాఖ అధికారుల భావన.

పొలాల్లో టెక్నాలజీతో ఆదాయం

రైతులు వారి భూమిలో వ్యవసాయం చేస్తూనే సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందాలన్నది ‘సోలార్’ కాన్సెప్ట్ ఉద్దేశం. ఇప్పటివరకూ వాడుతున్న రెగ్యులర్ సోలార్ ప్యానెళ్ల కింద పంటలు సాగు చేయడం కష్టం, దిగుబడి కూడా ఆశించినంతగా రాదు. ఈ ప్యానళ్లకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ సూర్యకాంతి నేలపైకి చేరేలా ప్రత్యేకంగా రూపొందించిన అగ్రి-వోల్టాయిక్ ప్యానెళ్లను కొత్త ప్రాజెక్టులో వాడుతారు.

రైతులు వారి భూమిలో సాధారణ పంటలు పండించుకుంటూనే సోలార్ కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం భూమిని లీజుకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇటు పంటలూ పండుతాయి.. అటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయ ఆదాయంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారానూ అదనపు ఆదాయం లభిస్తుంది.

ఈ కాన్సెప్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతారు. దీంతో సోలార్ ప్యానెళ్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఆటోమేటిక్‌గా ఉంటుంది. దుమ్ము, ధూళి పేరుకుపోయినా, ఆకుల్లాంటివి ప్యానెల్ పైభాగంలో ఉండిపోయినా శుభ్రపరిచేలా నిర్వహణపై నిరంతరం నిర్వాహకులకు అలర్ట్ మెసేజ్‌లు అందుతాయి. ఈ ఏఐ టెక్నాలజీ, నిర్వహణ వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 10% వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నది అధికారుల అంచనా.

అప్‌డేట్స్ కోసం మొబైల్ యాప్‌కు లింక్

‘సోలార్’ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ఉంటుంది. సోలార్ ప్యానెళ్ల ద్వారా రోజూ ఉత్పత్తయ్యే విద్యుత్, వినియోగం, గ్రిడ్‌కు విక్రయించిన యూనిట్లు, పంటల వివరాలు, పంట ఆరోగ్య సమాచారం, హెచ్చరికలు.. ఇలాంటి సూచనలన్నీ మొబైల్ యాప్‌కు రెగ్యులర్‌గా అందుతూ ఉంటాయి. అవసరాన్నిబట్టి ఇతర వ్యవసాయ యాప్‌లతోనూ అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. యాప్‌లో ఉండే రియల్‌ టైమ్ డ్యాష్‌బోర్డులో భూమి విస్తీర్ణం, పంటల షెడ్యూల్‌లు, రైతుల శిక్షణ కార్యక్రమాలు, విద్యుత్ ఉత్పత్తి, ఆదాయం వంటి వివరాలన్నీ గ్రాఫ్‌ల రూపంలో ఉంటాయి.

పైలట్ ప్రాజెక్టుతో అంచనాకు వచ్చి..!

అశ్వారావుపేటలోని (Aswaraopeta) వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో పైలట్ ప్రాజెక్టుగా త్వరలో చేపట్టబోయే ‘సోలార్’ పంట విధానాన్ని భవిష్యత్తులో రైతులకు అందుబాటులోకి తేవాలన్నది రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆలోచన. ఇందుకోసం ఈ పైలట్ ప్రాజెక్టు (Agrivoltaics Pilot Project) ద్వారా వచ్చే ఫలాలు, అంచనాలు, అనుభవాన్ని చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు 500 మంది రైతులకు తెలియజేసేలా అవగాహనా కార్యక్రమాలకూ ప్రణాళిక సిద్ధమవుతున్నది.

ఈ ప్రయోగం నుంచి వచ్చే ఫలితాలకు తగ్గట్టు ఒక 100 కిలోవాట్ల యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వాల నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది, ఈ యూనిట్ ద్వారా సగటున నెలకు ఎన్ని యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది, ఒక్కో యూనిట్‌ విద్యుత్‌కు డిస్కంలు ఎంత చెల్లిస్తాయి, ఒక నెలకు మ్యాగ్జిమమ్ ఎన్ని యూనిట్లను అమ్ముకోవచ్చు, యావరేజ్‌గా రైతులకు ఎంత ఆదాయం నికరంగా వస్తుంది.. వీటన్నింటిపై స్పష్టత వస్తుంది.

Read Also: ఏఐనీ చెడగొట్టేశారు.. యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్‌లో సంచలన విషయాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>