కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తెలంగాణలో (Telangana SIR) గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్వేకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో రెండు ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లిష్‌లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించేందుకు సిద్ధం అయ్యారు. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వో) ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకూ వాటిని ఇవ్వనున్నారు. ఓటర్లు ఆ ఫామ్ లను పూర్తి చేసి వచ్చే నెల 24లోపు బీఎల్‌వోలకు అందించాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీఎల్‌వోలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు.
ప్రతి ఇంటికి కనీసం మూడు సార్లు..
రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న ఈ ప్రక్రియలో (Telangana SIR) బీఎల్‌వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేసి వాటిని ఎలా నింపాలో వివరిస్తారు. ఓటర్లు ఫిల్ చేసిన రెండు పత్రాల్లో ఒకటి బీఎల్‌వో తీసుకుని, రెండో దాన్ని రసీదుగా ఇస్తారు. ఈసీ అధికారిక వెబ్ సైట్ https: voters.eci.gov.in లోనూ ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించవచ్చు. అయితే ఆన్ లైన్ లో ఫామ్ సమర్పించడానికి గురువారం నుంచి పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి.
రాజకీయ పార్టీలు అలర్ట్..
సర్ ప్రక్రియపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజీపీ పార్టీలు ఇప్పటికే తమ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశాయి. అధికార కాంగ్రెస్ శ్రేణులను టీపీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతలు అప్రమత్తం చేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. నియోజక వర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ కు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. బీజేపీ పార్టీ సైతం తమ పార్టీ శ్రేణులకు సర్ ప్రక్రియపై ప్రత్యక అవగాహన కల్పించింది. అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఈ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవోలు) 33 మంది, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు) 119 మంది, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్వోలు) 882 మంది, బీఎల్‌వో పర్యవేక్షకులు 3,596 మంది, బీఎల్‌ఏలు 35,985 మందిని నియమించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 35,985 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఉన్నారు.
Read Also: ఏఐనీ చెడగొట్టేశారు.. యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్‌లో సంచలన విషయాలు
Follow Us On: Instagram

