కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి అమృత్‌సర్ వస్తున్న ఎయిరిండియా విమానం (Air India Flight) జూన్ 22వ తేదీన పాకిస్థాన్ ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ విచారణ జరుపుతోంది. ఎయిరిండియాకు చెందిన ఎయిర్ బస్ విమానం అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో బర్డ్ స్ట్రైక్ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానాశ్రయ అధికారులు రన్‌వే పరిశీలన జరుపుతుండటంతో, విమానాన్ని కొంతసేపు గాల్లో హోల్డ్‌లో ఉంచాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశించింది.
అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం కొద్ది సేపు పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. వెంటనే పాక్ ఏటీసీకి సమాచారం అందించారు. చివరికి భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించగా, సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సీరియస్ అయిన డీజీసీఏ సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఆపరేటింగ్ క్రూపై చర్యలు తీసుకుంది.

