Mobile Popup Ad
Mobile Popup Ad

విపత్కర సమయాల్లో ప్రజలకు అండగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజ్

కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే భారీ వర్షాలు, వరదల దృష్ట్యా విపత్కర సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడాలని, జిల్లా పోలీస్ శాఖ తరఫున డీడీఆర్‌ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raju) తెలిపారు. బుధవారం నాడు అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద జరుగుతున్న డీడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖల ఉమ్మడి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి, సిబ్బందికి అందుతున్న శిక్షణ తీరును పర్యవేక్షించారు.

విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో డీడీఆర్‌ఎఫ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, శిక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ​రాబోయే వర్షాల వల్ల సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న బాధితులను రక్షించడానికి అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నామని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సంరక్షించడానికి ఈ ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో అవసరమయ్యే లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్ రింగ్స్, బోట్లు, రోప్స్ మరియు ఇతర అత్యవసర సామాగ్రి మొత్తాన్ని శిక్షణ పొందుతున్న బృందాలకు సమకూర్చడం జరిగిందని ఆయన వివరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు రక్షణ కోసం వెంటనే ‘డయల్ 100’ కు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ ఎల్లయ్య అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>