కలం, హనుమకొండ: ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Hanumakonda Collector) కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌ఐఆర్-2026 అమలు విధానం, ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై సమగ్ర వివరణ అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సరైన సమాచారం చేరవేసే విషయంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎస్‌ఐఆర్‌పై అపోహలు, అనుమానాలు తొలగించి అవగాహన పెంపొందించడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఓటరూ ఈ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన ముందస్తు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. వరంగల్ పశ్చిమలో 68 శాతం, పరకాలలో 87 శాతం మేర మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఆర్‌ఓ కె. శ్రీనివాస్, డీపీఆర్‌ఓ అయూబ్ అలీ,ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

