కలం, మెదక్ బ్యూరో : ఎల్‌నినో ప్రభావం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అసలే వాతావరణంలో అనుకోకుండా వస్తున్న మార్పులతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి, లేదంటే పంటలు చేతికి వచ్చే సమయంకు అకాల వర్షాలతో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఎల్‌నినో తరహా పరిస్థితులను అధిగమించడానికి, విభిన్న వాతావరణ పరిస్ధితులను తట్టుకోవడానికి సహజసిద్ధంగా చేసే విత్తనాలను గుళికలు(Seed Balls)గా తయారు చేయడం వలన, రైతులకు బహుళ ప్రయోజనాలు కల్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
పాత విధానమే .. కానీ ప్రయోజనకారి
వ్యవసాయంకు సంబంధించిన విత్తన గుళికలు తయారీ అనేది పాత విధానమేనని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద సహజసిద్ధంగా దొరికే మట్టి, సేంద్రీయ ఎరువులు, పదార్థాలను ఒక ముద్దగా మార్చి విత్తన గుళికలను తయారు చేస్తారని అంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. మొదటగా అవు పేడ, పుట్ట మట్టి, నీటితో చేసే బీజామృతంతో మనం పండించదల్చుకున్న విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఈ శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టెల బూడిదను జల్లడం ద్వారా విత్తనంపై పొరలు పొరలుగా ఏర్పడుతాయి.
ఇలా విత్తనం కవచం వలే లేయర్ మాదిరిగా మారడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3-5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. సీడ్ బాల్స్ అనేవి మట్టిలో కేవలం 10-15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. భూమిలో తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25-40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగల్గుతాయి. ఈ విత్తన గూళికలను కచ్చితంగా 5 సెం.మీ ,2 అంగుళాల లోతుల్లో మాత్రమే నాటుకోవాలి.
కాగా, సీడ్ బాల్స్ విధానం వలన రైతులకు పలు రకాల లాభాలు ఉన్నాయి. విత్తనాల గుళికను తయారు చేయడానికి వాడే మట్టి, కంపోస్ట్ ఎరువుల విత్తనానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీనివల్ల విత్తనం త్వరగా, బలంగా మొలకెత్తుతుంది.సీడ్ బాల్స్ అనేవి విత్తనాల వృథా తగ్గిస్తుంది. సైజు పెద్దదిగా ఉండటంతో గాలికి కొట్టుకుపోవడం, వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వంటివి జరగవు. దున్నడం, లోతుగా గుంతలు తీయడం వంటి శ్రమ లేకుండా విత్తన గుళికలను సులభంగా నాటవచ్చును . వీటిని నేరుగా పొలంలో జల్లిన మొలకెత్తె అవకాశం ఉటుంది. పక్షులు, కీటకాల నుండి రక్షణ ఉటుంది. విత్తనాల గుళికల వలన పోషకాలు కేవలం ఆ విత్తనానికి మాత్రమే అందుతాయి కాబట్టి, పక్కన ఉన్న కలుపు మొక్కల కంటే ముందే మన పంట మొక్క బలంగా ఎదుగుతుంది.
వర్షాధార పంటలకు ఎంతో మేలు
ఎల్‌నినో ప్రభావం వలన ప్రస్తుతం రుతుపవనాలతో అధారంగా వర్షాలు పడటంలేదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాల జాడేలేదు. ఎండ గట్టిగా కొడుతూ, అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. వాతవరణ పరిస్ధితులను అంచనా వేయడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వాతవరణ పరిస్ధితుల్లో విత్తన గుళికల పద్ధతి వర్షధారిత పంటలైన పంటలకు ఇవి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. తృణధాన్యాలు , చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు,పెసలు, మినుములు, కందులు, శనగలు లాంటి పప్పుధాన్యాలు, నువ్వులు, ఆవాల సాగు చాల మంచి ఫలితాలను ఇస్తాయి.
అంతేకాకుండా కూరగాయలు ,ఆకు కూరల్లో వీటి విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. టమోటా, మిరప, వంకాయ, తోటకూర, పాలకూర సాగుకు విత్తన గుళికల విధానం బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రదాన పంటలైన వరి నీటిలో పెరుగుతుంది. కాబట్టి వరికి, అలాగే బిటి జన్యు పత్తి విత్తనాలకు ఈ విధానం సాధ్యం కాదు. స్థానికంగా లభించే మట్టి ,ఎరువులు , ఇతర పదార్థాలతో చేసే ఈ సులభమైన పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
బహుళ ప్రయోజనాలు
వర్షాభావం, పొడి వాతావరణం కల్గి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు సీడ్ బాల్స్ విధానం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గుళికలోని మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచుతుందటంతో విత్తనాల మొలకెక్కడం ఎక్కువగా జరుగుతుంది. వానల కోసం వేచి ఉండకుండా, వర్షాలు పడటానికి కొన్ని రోజుల ముందే ఈ గుళికలను పొలంలో వేసుకొవచ్చును. వర్షం పడగానే గుళిక నానుకొని, లోపలి విత్తనం వెంటనే మొలకెత్తుతుంది.
రెండు ,మూడు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కల్గిన చిన్న ,సన్నకారు రైతులకు సీడ్ బాల్ ప్రక్రియ అన్ని విధాల లాభసాటిగా ఉటుంది. విత్తన గుళికల తయారీ ప్రక్రియ కొంచెం శ్రమతో కూడుకున్న , రైతులకు విత్తనాలు మొలకెత్తకుండా ఉండే నష్టం మొదలు అధిక పంట దిగుబడి వరకు బహుళ ప్రయోజనాలు కల్గిస్తుందని సిద్ధిపేట జిల్లా తొగుట మండల వ్యవసాయ విస్తరణాధికారి నాగర్జున అన్నారు. పంట పొలాల్లో లభించే మట్టి, సేంద్రియ ఎరువులు, పదార్ధలతో చేసే విత్తన గుళికలను రైతులు విరివిగా తయారు చేసుకోవాలని …గుళికల విధానం వలన రైతులకు బహుళ ప్రయోజనాలు కల్గుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

