కలం, వెబ్ డెస్క్: రోజుకో రకం స్కామ్ తో సైబర్ నేరగాళ్లు జనాలను దోచుకుంటున్నారు. తాజాగా వెలుగు చూస్తున్న ‘బాస్ స్కామ్'(Boss Scam) కూడా అందులో ఒకటి. సైబర్ పోర్టల్‌కు గత 20 రోజుల్లో దేశ వ్యాప్తంగా 300కి పైగా ఫిర్యాదులు వచ్చాయంటేనే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పందించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
బాస్ స్కామ్ అంటే ఏంటీ..?
ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి సీనియర్ అధికారులు లేదా బాస్ నుంచి అర్జెంట్ మెస్సేజ్ వచ్చినట్లుగా సైబర్ నేరగాళ్లు ZIP, RAR ఫైల్స్ వాట్సాప్, ఈ మెయిల్స్ చేస్తారు. నిజమేనని భావించి పొరపాటున తెరిస్తే మాల్ వేర్ చొచ్చుకెళ్లిపోతుంది. దీంతో వాట్సాప్ తో సహా ఫోన్ లో ఉన్న సమాచారం అంతా క్షణాల్లో వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. డబ్బులు బదిలీ చేసుకోవడం లేదా వ్యక్తిగత సమాచారం చూపి బెదిరించడం వంటివి చేస్తుంటారని సైబర్ బ్యూరో అధికారులు వెల్లడించారు.
ఆపాలంటే ఏం చేయాలి..?
ZIP, RAR పేరిట ఫైల్స్ వచ్చాయంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దు. ఒకవేళ, స్కామ్ బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు పూర్తిగా మెస్సేజుల మీద ఆధారపడొద్దు. కచ్చితంగా ఫోన్, ఈ మెయిల్ ద్వారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బెటర్ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే ఆపేయడం మేలని సూచిస్తున్నారు.
ఎలా ఫిర్యాదు చేయాలి…?
సైబర్ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా http://cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. వెంటనే స్పందించి, ఖాతాను నిలుపుదల చేస్తారని వివరించారు. ఆలస్యం చేసే కొద్దీ నష్ట తీవ్రత మరింత పెరగవచ్చని తెలిపారు.

