కలం, వెబ్ డెస్క్: ఏపీలో సగానికిపైగా ఉన్న బీసీలను రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అగ్రపథాన నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savitha) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాలైన విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ సర్కిళ్ల ద్వారా గ్రూప్ -1, గ్రూప్ – 2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వ రాకతో బీసీలకు మంచి రోజులు ప్రారంభం అయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కులాల చిచ్చుకు జగన్ కుట్రలు..
రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి చరిత్ర ఎరుగని నిధులను కేటాయించామని మంత్రి వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లకు కృషి చేస్తున్నామని చెప్పారు. గురుకులాలతో బీసీలకు అత్యున్నత విద్య అందిస్తున్నామని అన్నారు. రూ.500 కోట్లతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిప్పులు చెరిగారు. బీసీ సంక్షేమ శాఖలో గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

