కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉపాధ్యాయులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ కుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) హెచ్చరించారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), గండీడ్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లను బుధవారం జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా KGBV పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. KGBV స్పెషల్ ఆఫీసర్ కుమారి శివలీల విద్యాశాఖ ఉన్నత అధికారుల అనుమతి లేకుండా గైర్హాజరైనట్టు గమనించిన కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీకి ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మదాబాద్ మండల KGBV స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
మహమ్మదాబాద్ KGBV తనిఖీలో ఉపాధ్యాయులు వరండాలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వారి వారి తరగతులలోకి వెళ్లాలని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, టైం టేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
10వ తరగతి, 8వ తరగతి విద్యార్థుల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న విద్యా బోధన, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఉదయం అల్పాహారం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు ఎప్పుడు పాఠశాలకు చేరుకున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను కూడా కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్‌లో మరుగుదొడ్ల సౌకర్యం ఎలా ఉంది, ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా, అనే విషయాలపై విద్యార్థుల నుండి వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ కూరగాయలను సరిగా పెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న KGBV నూతన భవన పనులను తనిఖీ చేశారు. కాంట్రాక్టర్, వర్కర్లతో మాట్లాడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. మండల విద్యాధికారికి KGBV నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని ఆదేశించారు.
గండీడ్ PHCని తనిఖీ చేసిన కలెక్టర్ కుష్బూ గుప్తా
గండీడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుష్బూ (Khushboo Gupta) ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ నమోదవుతున్న ఓపీ నమోదు సంఖ్య, మందుల లభ్యత, గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా, లేదా అనే అంశాలపై వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో ప్రసవం జరిగిన ఓ మహిళతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారికి కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్య అధికారి జనార్ధన్, వైద్య అధికారి చందు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

