కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ లో స్కీములు లేవు కానీ.. రోజుకో స్కాం వెలుగు చూస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ శాఖలోని పీఎం కుసుమ్ పథకంలో కూడా రూ.1,000 కోట్ల కుంభకోణానికి తెర తీశారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి కేసీఆర్ హయాంలోని పథకాలను కూడా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. చాలా మంది అప్పులు చేసి పీఎం కుసుమ్ పథకంలో చేరి ప్లాంట్ల నిర్మాణం చేశారని చెప్పారు. 300 మెగావాట్ల వరకు ప్లాంట్ల నిర్మాణం పూర్తయి రెండు, మూడు నెలలు అయినా సింక్రనైజ్ చేసుకోవడం లేదని విమర్శించారు. ఇంధన శాఖ అధికారి ఒకరు, రెడ్కో అధికారి ఒకరు వారిని వేధించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. మెగావాట్ కు కోటి రూపాయలు ఇవ్వాలని అంటున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
మరో స్కాం బయటపెడుతా..
కొందరు ప్రభుత్వ పెద్దలు వారి రక్తం తాగుతున్నారని.. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినిపిస్తున్నాయని ఆరోపించారు. ఎవరి పాత్ర ఉందో భట్టి విక్రమార్క స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రూ.3.13 ధర చెబితే… నిన్నటికి నిన్న ఒక ఉన్నతాధికారి రూ.2.90 అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో పాత్ర ఉన్న అధికారుల పేర్లు త్వరలో భయటపెడతామని.. విద్యుత్ శాఖలో ఇంకో స్కాం కూడా ఉందని, దానిని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.
బీజేపీ వైపే హైబ్రిడ్ సీఎం..
బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. ముందు ఆయన పదవి ఉంటుందో లేదో చూసుకోవాలని జగదీశ్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. బీజేపీ, హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటే అని నిన్న తేలిపోయిందన్నారు. మొన్న ప్రధాని పిలిచారు.. మ్యాచ్ ఫిక్సింగ్ లో తిట్టుకున్న ఇద్దరు (రేవంత్ రెడ్డి ,కిషన్ రెడ్డి) ఢిల్లీలో డ్యూయెట్ పాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రికి పీఏగా పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రిని భయపడితే మరో కేంద్ర మంత్రిని కలిపించడం భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా చూశామా? అని అడిగారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ హైబ్రిడ్ సీఎం బీజేపీ వైపే అని అందరికీ తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

