Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నేరాల నియంత్రణనలో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) అన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జానకి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నేరాల నియంత్రణలో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమైన జిల్లా ఎస్పీ వారి శాఖాపరమైన అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి తెలియజేయవచ్చని తెలిపారు.

పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఆదేశించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణించే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఆదర్శంగా పాటించి ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. అంతేకాకుండా ‘ఇన్స్పెక్షన్’ (Inspection) సందర్భంగా ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తున్న పోలీస్ సిబ్బంది హెల్మెట్లను జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండి, సిబ్బందితో సమన్వయం పెంచుకొని సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>