కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా మంగళవారం నాడు కొత్త పనులు ప్రారంభించవచ్చా లేదా అనే విషయంలో ప్రజల్లో కొన్ని అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. మంగళవారం ఏ పని మొదలు పెట్టినా అరిష్టమని, ఆ రోజున మంచి కార్యాలను చేయకూడదని నమ్ముతుంటారు. కానీ ఇది ఎంత వరకు నిజం. మంగళవారం (Tuesday Beliefs) నాడు నిజంగానే ఏ పని మొదలు పెట్టకూడదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని గురించి హిందూ ధర్మశాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. మంగళవారం అరిష్టమని, ఏ పనులు చేయొద్దు అనేది కేవలం అపోహ మాత్రమేనని చెబుతున్నారు. మంగళవారం అనేది మంగళప్రదమైన రోజుగా పరిగణిస్తున్నారు. అయితే మంగళవారం ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులకు దూరంగా ఉండాలి అనే విషయాలను వివరించారు.
మంగళవారం చేయాల్సిన పనులు
అయితే, శాస్త్రం ప్రకారం.. మంగళవారం ఏదైనా పని చేస్తే అది మళ్లీ మళ్లీ జరుగుతుందని చెబుతుంటారు. అందుకే మంగళవారం నాడు మంచి పనులనే చేయాలని సూచిస్తుంటారు. ఈ రోజున మనం చేసే శుభ కార్యాలు, పెట్టుబడులు, కొనుగోళ్లు శుభాన్ని, వృద్ధిని తీసుకువస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు.. ఒకవేళ మంగళవారం నాడు బ్యాంకులో కొంత డబ్బు వేస్తే, త్వరలోనే మళ్లీ ఎక్కువ డబ్బులు వేసే అవకాశం కలుగుతుందట. మంగళవారం నాడు కొత్త బట్టలు కొనుగోలు చేయడం లేదా మొదటిసారి ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
చేయకూడని పనులు
మంగళవారం నాడు కొన్ని రకాల పనులు చేయడం వలన అవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. ఉదాహరణకు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం.. మంగళవారం నాడు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఆ రోజున రుణం తీసుకుంటే చాలాకాలం వరకు తీరదని చెబుతున్నారు. మంగళవారం నాడు గోళ్లు కత్తిరించడం, క్షవరం చేయించుకోవడం వలన ఆయుష్షు తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
అయితే మంచి చేసేందుకు ముహుర్తంతో పనిలేదని, మంగళవారం రోజు మంచి పనులను బ్రహ్మాండంగా ప్రారంభించవచ్చని శాస్త్రం చెబుతోంది.
మంగళవారం హనుమాన్ పూజ..
హిందూ సంప్రదాయంలో ఆంజనేయుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మంగళవారాన్ని (Tuesday Beliefs) భావిస్తారు. ఈ రోజు హనుమాన్ పూజ, హనుమాన్ చాలీసా పారాయణం, సింధూరార్చన చేయడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. శత్రు బాధల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వాసం. మంగళవారం ఆంజనేయుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో సానుకూల మార్పులు, విజయాలు, శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
Read Also: మన జట్టు లేకపోయినా.. తగ్గని ఫిఫా క్రేజ్!
Follow Us On: Instagram

