కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు (Saikrishna Case)లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ కేసు విచారణకు నలుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ (SIT) బృందం మంగళవారం సీఐ నాగరాజును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, నాగరాజు విచారణలో అధికారులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది.
తాజాగా ఈ కేసును సీబీఐ (CBI)కి అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్ట్ (AP High Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే సిట్ ఈ కేసులో విచారణ ప్రారంభించిందని తెలిపింది. కాబట్టి కొంత కాలం వేచి చూడాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. మరోవైపు నేడు సిట్ అధికారులు నాగరాజుకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

