Mobile Popup Ad
Mobile Popup Ad

మన జట్టు లేకపోయినా.. తగ్గని ఫిఫా క్రేజ్!

కలం, స్పోర్ట్స్ ప్రతినిధి : ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్ లేదు.. కానీ దేశం మొత్తం ఫుట్‌బాల్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. అర్ధరాత్రి దాటినా టీవీల ముందు కూర్చునే యువత, భారీ స్క్రీన్ల వద్ద సందడి చేసే అభిమానులు, తమకు ఇష్టమైన జట్ల జెర్సీలు వేసుకుని రోడ్లపైకి వచ్చే ఫ్యాన్స్.. ఎక్కడ చూసినా వరల్డ్ కప్ హంగామానే కనిపిస్తున్నది. భారత్ టోర్నీలో లేకపోయినా, ఫుట్‌బాల్‌పై భారతీయుల ప్రేమ (FIFA craze India) ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం.

ఫిఫా వరల్డ్ కప్‌కు భారత్ అర్హత సాధించకపోవడం ఇదేమీ కొత్త కాదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా టోర్నీపై భారత్‌లో ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్రసారాలు, పబ్లిక్ స్క్రీనింగ్‌లు అభిమానులను ఫుట్‌బాల్‌ ఆటకు మరింత దగ్గర చేశాయి. కేరళంలో ఫుట్‌బాల్ ఒక ఆట కంటే ఎక్కువ. అక్కడ వరల్డ్ కప్ అంటే పండుగ. అర్జెంటీనా, బ్రెజిల్ జట్ల భారీ కటౌట్లు, జెండాలు, ర్యాలీలు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే సీన్. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ప్రతి మ్యాచ్ ఒక పెద్ద ఈవెంట్‌లా మారుతున్నది.

ఒక్కొక్కరు ఒక్కో జట్టుకు సపోర్ట్

ఫిఫా వరల్డ్ కప్‌లో భారత జట్టు లేకపోవడంతో.. భారత ఫ్యాన్స్ విదేశీ జట్లలో ఎవరికి నచ్చింది వారు ఎంచుకున్నారు. కొందరు అర్జెంటీనా, మరికొందరు బ్రెజిల్‌కు మద్దతు ఇస్తేంటే.. ఇంకొందరు అభిమానుల్లో ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ జట్లకు మంచి క్రేజ్ కనిపిస్తున్నది. యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్ ప్రభావం కూడా దీనికి కారణమైంది. ఈసారి మరో ఆసక్తికర అంశమేమిటంటే.. భారత సంతతి ఆటగాళ్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. భారత మూలాలు ఉన్న ఆటగాళ్లు ప్రపంచ వేదికపై కనిపించడంతో అభిమానులు వారిని ప్రత్యేకంగా గమనిస్తున్నారు. దేశం తరఫున ఆడకపోయినా, భారతీయ మూలాలు ఉన్న ఫుట్‌బాలర్ల విజయాలను తమ విజయాలుగా భావిస్తున్నారు.

పబ్లిక్ స్ర్కీనింగ్‌తో ఫుల్ జోష్..

ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను భారత అభిమానులకు చేరువ చేసేందుకు ప్రసార సంస్థలు కూడా భారీ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అధికారిక పబ్లిక్ స్క్రీనింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో ఫుట్‌బాల్ వాతావరణం మరింత విస్తరించింది. పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్‌లు, విద్యాసంస్థలు, విమానాశ్రయాల్లోనూ మ్యాచ్‌ల ప్రసారాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన వీక్షణ ఇప్పుడు సామూహిక అనుభవంగా మారింది. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్‌లలో కీలక మ్యాచ్‌లు ప్రదర్శిస్తున్నారు. పెద్ద తెరపై వేలాది మంది కలిసి మ్యాచ్ చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తున్నది. గోల్ పడితే థియేటర్ మొత్తం స్టేడియంలా మారిపోతున్నది.

ఆటపై దృష్టి అవసరం

ఈసారి ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు అమెరికా, కెనడా, మెక్సికోలో జరుగుతున్నాయి. చాలా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమవుతున్నాయి. అయినప్పటికీ అభిమానులు నిద్రను పక్కనపెట్టి మ్యాచ్‌లు చూస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా చర్చలు, డిజిటల్ వాచ్ పార్టీలతో రాత్రంతా ఫుట్‌బాల్ గురించే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి భారత్‌లో ఫుట్‌బాల్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని అర్థమవుతున్నది. ఆ అభిమానాన్ని ఫలితాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. క్రీడా శాఖ ఫుట్‌బాల్‌ ఆటపై మరింత దృష్టి పెట్టి, నేషనల్‌ జట్టును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>