Mobile Popup Ad
Mobile Popup Ad

ఫేస్ స్కాన్ .. ఎయిర్‌పోర్టులో సరికొత్త టెక్నాలజీ..!

క‌లం, న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టు (Airport)లో కెమెరా ముందు నిలబడితే చాలు.. ఆ వ్యక్తి గత చరిత్ర మొత్తం బయటకు వచ్చేలా కేంద్రం కొత్త వ్యవస్థను అందుబాటులోకి రాబోతున్నది. ఉగ్రవాదులు, లుక్ ఔట్ నోటీసులున్న నిందితులు, దేశం దాటి పోకుండా, దేశంలోకి అడుగుపెట్టకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతను విమానాశ్రయాల్లో తీసుకురాబోతున్నారు. ఇందు కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యం కోసం వినియోగిస్తున్న డిజి యాత్ర ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ (Face Scan)ను నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో అనుసంధానం చేయనున్నారు. ఉగ్రవాద అనుమానితులు, పరారీలో ఉన్న నేరస్థులు, లుక్‌అవుట్ సర్క్యులర్ ఉన్న వ్యక్తులను రియల్‌టైమ్‌లో గుర్తించేలా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రధాన విమానాశ్రయాల్లో అమల్లో ఉన్న డిజి యాత్ర వ్యవస్థను కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో అనుసంధానం చేయనున్నారు.

ఏమిటి డిజి యాత్ర యాప్?

2018లో కేంద్ర పౌర విమానయాన శాఖ డిజి యాత్ర యాప్ ప్రారంభించింది. ప్రయాణికులకు పేపర్ లెస్ సేవలు అందించడం.. సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యాప్ ను తీసుకొచ్చింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుంచి బోర్డింగ్ వరకు ఎలాంటి ఐడీ కార్డులు చూపకుండా కేవలం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికత ఉపయోగించేలా రూపొందించారు.

2022 డిసెంబరులో ఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో ప్రారంభమైన ఈ సేవ ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణే, విజయవాడ సహా 24కుపైగా విమానాశ్రయాలకు విస్తరించింది. 2025 నాటికి 55 లక్షలకు పైగా మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా, సుమారు మూడు కోట్ల మంది ఈ సేవను వినియోగించారు.

ఇప్పటి వరకు ఎలా పనిచేస్తోంది?

ప్రస్తుతం ఈ యాప్ లో ప్రయాణికుడు యాప్‌లో నమోదు చేసుకుని, ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాన్ని ధృవీకరించి, బోర్డింగ్ పాస్‌ను అప్‌లోడ్ చేస్తారు. విమానాశ్రయ ప్రవేశ ద్వారంలో కెమెరా ముఖాన్ని గుర్తించి, బోర్డింగ్ వివరాలతో సరిపోల్చి ఆటోమేటిక్‌గా ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. ఈ విధానం వల్ల చెక్-ఇన్ సమయం తగ్గడం, సీఐఎస్‌ఎఫ్ తనిఖీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గడం వంటి ప్రయోజనాలు చేకూరాయి.

జాతీయ భద్రతా కోసం

డిజి యాత్ర యాప్ ను కేవలం ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే కాకుండా జాతీయ భద్రతా వ్యవస్థలో భాగంగా మార్చాలని సీఐఎస్‌ఎఫ్ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా సేకరించే చిత్రాలను నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. దీంతో ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే జాతీయ డేటాబేస్‌లోని వివరాలతో సరిపోల్చి ఉగ్రవాద అనుమానితులు, పరారీలో ఉన్న నేరస్థులు, లుక్ అవుట్ సర్క్యులర్ ఉన్న వ్యక్తులు, నకిలీ గుర్తింపులతో ప్రయాణించే వారిని సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

ఆరు విమానాశ్రయాల్లోనే తొలి దశ

మొదట ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా విమానాశ్రయాల్లో ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఐఎస్‌ఎఫ్ ప్రతిపాదించింది. ప్రతి సీసీటీవీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అమర్చకుండా, ప్రధానంగా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో మాత్రమే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఏమిటీ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్?

2008 ముంబయి ఉగ్రదాడుల అనంతరం కేంద్రం నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ను స్థాపించింది. ఈ సంస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తున్నది. ఇందులో ఆధార్, పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ రికార్డులు, విమాన, రైల్వే ప్రయాణ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, వాహనాల నమోదు, ఫాస్టాగ్, టెలికాం మెటాడేటా, నేర రికార్డులు తదితర పలు డేటాబేస్‌లు అనుసంధానమై ఉన్నాయి. అవసరమైనప్పుడు దర్యాప్తు, నిఘా సంస్థలు ఈ సమాచారాన్ని వినియోగిస్తాయి.

గోప్యతపై ఆందోళనలు

ఈ ప్రతిపాదనపై పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సామూహిక నిఘా, బయోమెట్రిక్ డేటా భద్రత, నిర్దోషులను పొరపాటున అనుమానితులుగా గుర్తించే ప్రమాదం వంటి అంశాలపై స్పష్టమైన విధానాలు అవసరమని పేర్కొంటున్నాయి. ప్రయాణికుల బయోమెట్రిక్ సమాచారాన్ని శాశ్వతంగా నిల్వ చేయబోమని, ప్రయాణం పూర్తైన తర్వాత నిర్దిష్ట వ్యవధిలో తొలగిస్తామని డిజి యాత్ర అధికారులు మాత్రం చెబుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రణాళిక దశలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>