Mobile Popup Ad
Mobile Popup Ad

డేటా సెంటర్లకు జీరో వాటర్!

కలం, వాషింగ్టన్: ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్ల (AI Data Centers)పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. వాటి నిర్వహణకు పెద్ద ఎత్తున నీరు, విద్యుత్ అవసరం అవుతున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్ల కోసం 2025లో 900 కోట్ల లీటర్లకు పైగా నీళ్లను వినియోగించినట్టు అమెజాన్ ఇటీవల ప్రకటించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల నిర్వహణకు 9 లక్షల కోట్ల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

అమెరికాలో ఇప్పటికే భారీ సంఖ్యలో డేటా సెంటర్లు ఏర్పాటు కావడం, వీటికి పెద్ద ఎత్తున నీళ్లు, విద్యుత్ వినియోగిస్తుండడంతో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. డేటా సెంటర్లతో నీటి వనరులన్నీ ఖాళీ అయిపోతాయని నిరసనలు ఊపందుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై తాత్కాలిక నిషేధం, ఆంక్షలు విధించారు.

ఇలాంటి తరుణంలో నీళ్లే అవసరం లేకుండా డేటా సెంటర్లను నిర్వహించేందుకు ఎన్విడియా కొత్త టెక్నాలజీని కనిపెట్టింది. ‘రూబిన్-జనరేషన్’ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆవిష్కరించింది. ఇందులో పూర్తిగా లిక్విడ్-కూలింగ్ డిజైన్‌ ఉపయోగించింది. ఇది సాంప్రదాయ ఎయిర్ కూలింగ్ (గాలి ద్వారా చల్లబరచడం) విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టడమే గాకుండా, నీటిపై ఆధారపడే శీతలీకరణ పద్ధతుల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

తగ్గనున్న విద్యుత్ బిల్లులు

ఎన్విడియా రూపొందించిన డీఎస్‌ఎక్స్ ఏఐ ఫ్యాక్టరీ రిఫరెన్స్ డిజైన్‌లో భాగంగా లిక్విడ్ కూల్డ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీతో డేటా సెంటర్ల నిర్వహణకు నీళ్ల అవసరమే ఉండదు. ‘‘మా డీఎస్‌ఎక్స్ డిజైన్ ద్వారా భారీ మొత్తంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పూర్తిగా నీటి వినియోగమే లేకుండా చేశాం. వాతావరణ పరిస్థితులను బట్టి చాలా అరుదైన సమయాల్లో మాత్రమే అత్యల్ప కాలం పాటు అదనపు కూలింగ్ వ్యవస్థలు అవసరమవుతాయి.

అలాంటప్పుడు మాత్రమే నీరు అవసరమవుతుంది” అని ఎన్విడియా (Nvidia) డేటా సెంటర్ కూలింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ అలీ హైదరి పేర్కొన్నారు. సాధారణంగా ఒక డేటా సెంటర్ వినియోగించే మొత్తం విద్యుత్‌లో కూలింగ్ కోసమే దాదాపు 40 శాతం ఖర్చవుతుంది. ఎన్విడియా తెచ్చిన ఈ సరికొత్త లిక్విడ్ కూలింగ్ విధానం ద్వారా అటు విద్యుత్ బిల్లులు, ఇటు నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గుతాయి.

ఏంటీ కూలింగ్ సిస్టమ్?

– ఈ టెక్నాలజీలో చిప్ స్థాయిలోనే వేడిని నేరుగా తొలగించడానికి సీల్డ్ కోల్డ్ ప్లేట్ల గుండా ఒక ప్రత్యేక ద్రవాన్ని ప్రవహింపజేస్తారు. ఇది చిప్స్ నుంచి వేడిని గ్రహించి, ఒక క్లోజ్డ్ లూప్‌లో నిరంతరం రీసైకిల్ అవుతూ ఉంటుంది.
– ఈ టెక్నాలజీతో డేటా సెంటర్లలో (AI Data Centers) సాధారణంగా వాడే భారీ కూలింగ్ టవర్లు, విపరీతంగా విద్యుత్ వినియోగించే పెద్ద పెద్ద ఫ్యాన్ల అవసరం ఉండదు.
– సాధారణంగా డేటా సెంటర్లను చాలా చల్లని వాతావరణంలో ఉంచాలి. కానీ ఎన్విడియా కొత్త సిస్టమ్‌లోని కూలింగ్ లిక్విడ్ 45 డిగ్రీల వరకు ఉన్నా సురక్షితంగా పని చేస్తుంది.
– సాధారణంగా మనుషులు స్నానం చేసే హాట్ టబ్‌లలో నీరు 38–40 డిగ్రీలు ఉంటుంది. అందులో మనుషులు కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండగలరు. కానీ ఎన్విడియా సరికొత్త ఏఐ సర్వర్లు అంతకంటే ఎక్కువ వేడిని తట్టుకుని పని చేయగలవు. ఇలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేయడం వల్ల అదనపు కూలింగ్ పరికరాల అవసరం తగ్గి, విద్యుత్ ఆదా అవుతుంది.

Read Also:  ఫేస్ స్కాన్ .. ఎయిర్‌పోర్టులో సరికొత్త టెక్నాలజీ..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>