కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని రాయదుర్గం భూ వివాదం (Rayadurgam Land Dispute)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో నెలకొన్న ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎస్బీఐ అంగీకరించినట్లు సమాచారం.
ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ మార్గాలకు బ్యాంక్ సానుకూలంగా స్పందించింది. వివాదాస్పద భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సూచించిన 2.5 ఎకరాల భూమిని తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ సూచనలను బ్యాంక్ యాజమాన్యం ఆమోదించడంతో ఈ వివాదానికి (Rayadurgam Land Dispute) తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్‌బీఐ నిర్వహించే ఆర్థిక లావాదేవీలు యథాతథంగా కొనసాగనున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ, బ్యాంకులో ఉండే ప్రభుత్వ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గ్రాంట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీనితో పాటు ఎస్బీఐకి ఉన్న ‘లీడ్ బ్యాంక్’ హోదాను కూడా కొనసాగించనున్నారు. హైకోర్టులో జరగబోయే తదుపరి విచారణ అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also: ఫేస్ స్కాన్ .. ఎయిర్‌పోర్టులో సరికొత్త టెక్నాలజీ..!
Follow Us On: Sharechat

