Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసింగ్ ఫెయిలైందా..: వరుస హత్యలతో వణుకుతున్న నల్లగొండ!

కలం, నల్లగొండ బ్యూరో : వరుసగా జరుగుతున్న దారుణాలు నల్లగొండ (Nalgonda) జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మిర్యాలగూడ ట్రిపుల్ మర్డర్, నల్లగొండ శివారులో యువకుడి హత్య, అనుమానాస్పదంగా నలుగురు మృతి వంటివి తీవ్ర సంచలనంగా మారాయి. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల పెట్రోలింగ్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మిర్యాలగూడలో ముగ్గురి మృతి ఘటనలో నిందితుడికి గంజాయి లేదా ఇతర వ్యసనాల ప్రభావం ఉందా..? అనే కోణంలోనూ చర్చ జరుగుతున్నది.

పోలీసుల వైఫల్యమేనా..?

ఆయా ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసుల తీరుపై, క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాత నేరస్తుల కదలికలు గుర్తించడంలో, స్థానిక గొడవలను ముందే గుర్తించి నియంత్రించడంలో, కౌన్సిలింగ్ ఇవ్వడంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహణలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని గంజాయి అమ్మకాలు, అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదనేది చర్చించుకుంటున్నారు. బాధిత కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

బయటకు రావాలంటేనే..

నల్లగొండలోని తెలంగాణ కాలనీలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా చనిపోయి కనిపించిన ఘటనలో.. హత్యా.. ఆత్మహత్యా..? అనే అనుమానాలు తలెత్తాయి. ఇలా వరుసగా ఘటనలు జరుగుతుంటే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రాత్రి వేళల్లో ప్రయాణించాలన్నా భయపడాల్సి వస్తుందని నల్లగొండ (Nalgonda) ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి నిందితులను పట్టుకోవడం మాత్రమే కాదు. ముందస్తుగా నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రజల్లో భయం పోయి, పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. వరుస హత్యల నేపథ్యంలోనైనా నల్లగొండ జిల్లా పోలీసులు మేల్కొని, విమర్శలను పక్కనపెట్టి, క్షేత్రస్థాయిలో గస్తీని ముమ్మరం చేయాలని, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు.

రాజకీయ పైరవీలతో పోస్టింగులు

జిల్లాలోని కొన్ని కీలక పోలీస్ స్టేషన్లలో పోస్టింగుల ప్రక్రియ అర్హత, సమర్థత ఆధారంగా కాకుండా పైరవీలతోనే నడుస్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. అధికార పార్టీ లీడర్ల సిఫార్సులతో రూ. లక్షల్లో ముడుపులు చెల్లించి నచ్చిన ప్రాంతాల్లో పోస్టులు దక్కించుకుంటున్నారనే ఆరోపణలు పోలీసు శాఖలోనే అంతర్గతంగా ఉన్నాయి. రాజకీయ బాసులకే జవాబుదారీగా ఉంటున్నారని స్టేషన్లలో సామాన్యుడికి న్యాయం జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, జిల్లా పోలీసుల్లో సీన్ రివర్స్‌గా ఉంది. ప్రధాన పట్టణాలు, హైవే ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో, భూ వివాదాల్లో కొందరు పోలీస్ అధికారులు నేరుగా జోక్యం చేసుకుంటున్నారని, సివిల్ పంచాయితీలు, సెటిల్‌మెంట్లపై పెడుతున్న శ్రద్ధలో శాంతిభద్రతల పరిరక్షణపై పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. రౌడీషీటర్ల కదలికలు కనిపెట్టడం, గంజాయి ముఠాలపై నిఘా పెట్టడం వంటి కీలక బాధ్యతలను విస్మరించడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయనేందుకు ఇటీవల జిల్లాలోని జరిగిన ఘటనలు అందుకు బలాన్నిస్తున్నాయి.

జిల్లాలో నెలలో జరిగిన ఘటనలు ఇలా..

ఈనెల 5న మిర్యాలగూడ కలాల్‌వాడలో ‘ట్రిపుల్ మర్డర్’ లో కన్న పిల్లలను, వృద్ధురాలని కూడా చూడకుండా పెట్రోల్ పోసి హత్య చేసిన నిందితుడు.
ఈనెల 8న నల్లగొండ టౌన్ పరిధి గొల్లగూడలో యువకుడు బొంతు సాయిని రూ.30వేల కోసం అర్ధరాత్రి బండరాళ్లతో కొట్టి మర్డర్.
ఈనెల 22న నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించిన నాలుగు మృతదేహాలు.

Read Also: మన జట్టు లేకపోయినా.. తగ్గని ఫిఫా క్రేజ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>