Mobile Popup Ad
Mobile Popup Ad

విత్తన మేళాను సద్వినియోగం చేసుకోండి.. రైతులకు కలెక్టర్ సూచన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలోని రైతు వేదికలలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట (Narayanpet) జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) తెలిపారు. రైతులు మేళాలో లభించే నాణ్యమైన విత్తనాలను తీసుకోవాలని అన్నారు. మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ఆ గ్రామ సర్పంచి సంగీతతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అన్ని రైతు వేదికలలో ఇలాంటి విత్తన మేళాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లాలో రైతులు ఎక్కువగా వరిని పండిస్తారని అన్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిందన్నారు.

జిల్లాలో సీతా ఫలాలు, మామిడి తోటలను సాగు చేసే రైతులు కూడా ఉన్నారని, ఉద్యాన పంటలు కూడా సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అంతర్ పంటలను కూడా ప్రోత్సహిస్తోందని, రైతులు ఆ దిశగా ఆసక్తి కనబరచాలని కోరారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయం చేసుకుని ఆయిల్ ఫామ్ సాగు చేసేలా జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం యూరియా ఆన్ లైన్ యాప్‌ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.

అంతకు ముందు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 76 రైతు వేదికలుండగా 60 రైతు వేదికలలో విత్తన మేళాలను ఏర్పాటు చేయనున్నారని అన్నారు. తొలి రోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలోని రైతు వేదికలలో విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. బుధవారం రోజు జిల్లాలోని మిగతా రైతు వేదికలలోనూ విత్తన మేళాలను ప్రారంభిస్తామని అన్నారు.

ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికలలో విత్తన మేళాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆయా విత్తన మేళాలలో 7 రకాల సన్న రకం వరి విత్తనాలతో పాటు కంది, పెసర, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విత్తన మేళాలలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఆన్ లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఏవో బాలదినకర్, ఏఈవోలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read Also: హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం క్యాష్‌తో వ్యాన్ డ్రైవర్ పరార్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>