కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఢిల్లీలో భేటీ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్ మెట్రో విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. శేరిలింగంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఏదో తీసుకువచ్చినట్లు ఇద్దరూ కలిసి నాటకాలు మొదలుపెట్టారన్నారు.
హైదరాబాద్ లో కిషన్ రెడ్డిపై (Kishan Reddy) విమర్శలు చేస్తున్న సీఎం.. ఢిల్లీలో కలిసి నాటకాలు ఆడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ, ఎయిర్పోర్ట్ కు మెట్రో రద్దు చేసిన రేవంత్ ను, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన (KTR) చెప్పారు. హైదరాబాద్ మెట్రో దగ్గర ఉన్న 250 ఎకరాల భూములను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన అన్నదమ్ములకు, బావమరిదికి, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ తన స్వార్థం కోసం ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ అండ్ టీ కోసం రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎల్ అండ్ టీ కట్టాల్సిన అప్పును రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పి మెట్రో ను దివాళా తీయించే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో విషయంలో రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఎన్ని నాటకాలు ఆడినా.. హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలు ఎక్కాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి సీఎం కావాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Also: ఇండియా ఇష్టం లేదు.. డబ్బులొస్తే వెళ్లిపోతా: కాక్రోచ్ పార్టీ క్యాంపైనర్
Follow Us On: X(Twitter)

