కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం ముక్తాపూర్ (Mukthapur) గ్రామంలో సర్పంచ్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. గ్రామ సర్పంచ్ రమేష్ బీడీ టేకేదార్‌గా ఉండగా.. ఆయన భార్య సంగీత అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. సర్పంచ్ రమేష్ (ఐడీ నంబర్ NRLAB02070) చేయూత పథకంలో 2023 నుండి, అంగన్వాడీ టీచర్ సంగీత (ఐడీ నంబర్ ADNRR70879) బీడీ కార్మికురాలిగా 2015 నుండి.. నెలకు రూ. 2,016 చొప్పున ఆసరా పెన్షన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పొందుతున్నారనే వార్తలు గ్రామ ప్రజల్లో చర్చకు దారితీశాయి.
అసలైన అర్హులకు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంటే పదవుల్లో ఉన్నవారికి ఎలా పెన్షన్లు మంజూరు అవుతున్నాయి అంటూ గ్రామంలోని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులకే అందుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి అర్హతల ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also: ఇండియా ఇష్టం లేదు.. డబ్బులొస్తే వెళ్లిపోతా: కాక్రోచ్ పార్టీ క్యాంపైనర్
Follow Us On: Instagram

