కలం, మెదక్ బ్యూరో : ఆప్యాయంగా పెంచుకొని, అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చిన సొంత అమ్మమ్మనే మనవడు హత్య చేసిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధి పదో వార్డులో నివాసముండే దోమకొండ సాయమ్మ (60) అనే వృద్ధురాలు ఈ నెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటుగా అనుమానించిన బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇదే క్రమంలో మృతదేహం మెడ భాగంలో ఘాట్లు ఉండగా బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
మూడు రోజుల కార్యక్రమం పూర్తి చేస్తున్న క్రమంలో ఆమె ఒంటిపై బంగారం కనిపించకపోవడం, బీరువాలో వెతికినా బంగారం లేకపోవడంతో అనుమానం వ్యక్తం అయింది. ఇదే క్రమంలో సాయమ్మ చిన్న కూతురి కుమారుడు విశాల్ 17వ తేదీ రాత్రి తన అమ్మమ్మ దగ్గరకు వచ్చినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. దీంతో మనువడు విశాల్ ను కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 17వ తేదీన ఎప్పటి మాదిరిగా అమ్మమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు అడగగా తన వద్ద 7000 రూపాయలు మాత్రమే ఉన్నాయని అంతకుమించి డబ్బు లేదని చెప్పింది, తనకు ద్విచక్ర వాహనం కొనుక్కోవడానికి డబ్బులు కావాలని మనవడు ఒత్తిడి చేశారు.
ఇదే క్రమంలో తన స్నేహితుడైన ప్రశాంత్ తో కలిసి కల్లులో మత్తు మాత్రలు ఇచ్చి తాగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనంతరం ఒంటిపై ఉన్న బంగారు కమ్మలతో పాటు, బీరువాలో ఉన్న డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో మత్తులో ఉన్న సాయమ్మ అరవడంతో వెంటనే స్పందించిన మనవడు ఆమె గొంతు నులుముగా, అతని స్నేహితుడు కాళ్లు పట్టుకున్నారు. ఇదే క్రమంలో ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని బంగారం తీసుకొని పరారయ్యారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, అమ్మమ్మను తానే హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ కేసులో విశాల్ తో పాటు అతని స్నేహితుడు ప్రశాంత్ ను అరెస్టు చేసి వారి నుండి బంగారు నగలు సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ సైదా నాయక్ తెలిపారు.

