Mobile Popup Ad
Mobile Popup Ad

ధర్మపురి నుంచి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) పిలుపు నిచ్చారు. ధర్మపురి (Dharmapuri) కి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ధర్మపురి నుంచి నిర్మల్, కరీంనగర్ కు రెండు కొత్త బస్సు సర్వీసులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి బస్టాండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని అన్నారు.

భక్తుల సౌకర్యం కోసం నిర్మల్ నుంచి ధర్మపురి వరకు ఎక్స్‌ప్రెస్ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఉదయం 7 గంటలకు నిర్మల్ నుంచి దస్తురాబాద్, కడెం, ఖానాపూర్ మీదుగా ధర్మపురి వస్తుందని మంత్రి వివరించారు. రోజుకు రెండు ట్రిపుల చొప్పున నిర్మల్ – ధర్మపురి మధ్య బస్సు నడుస్తుందని మంత్రి అడ్లూరి తెలిపారు. ధర్మపురి నుంచి జగిత్యాల మీదుగా ప్రయాణం కష్టంగా ఉన్న నేపథ్యంలో రాయపట్నం, వెల్గటూర్, ధర్మారం, చొప్పదండి మీదుగా కొత్త బస్సు సర్వీస్ ను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.

కొత్త సర్వీస్ ఉదయం 7 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరి ధర్మపురి, రాయపట్నం, వెల్గటూర్, ధర్మారం మీదుగా కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. కొత్త సర్వీస్ విద్యార్ధులకు, ఉద్యోగులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. అదే విధంగా కరీంనగర్ నుంచి రాత్రి 9 గంటలకు ధర్మపురికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ చొరవతో ధర్మపురి నియోజకవర్గంలో కొత్తగా 11 రూట్లలో నూతన బస్సు సర్వీసులు నడిపించడానికి అనుమతి తీసుకున్నామని అడ్లూరి తెలిపారు.

నియోజకవర్గంలోని విద్యార్థుల సౌకర్యం కోసం నూతన బస్సు సర్వీసులు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సహకరించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఆర్టీసీ సేవలు అందిస్తుందని అన్నారు. ధర్మపురికి వచ్చే భక్తుల కోసం నూతనంగా నడిపిస్తున్న సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని దినేష్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, నాయకులు వేముల రాజుతో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, జగిత్యాల డిపో మేనేజర్ రమేష్, నిర్మల్ డిపో మేనేజర్ పండరి, ఆర్టీసీ జగిత్యాల సీఐ శ్రీనివాస్, ఎఫ్ఎం నిర్మల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>