Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో భారీ సభ.. చారిత్రాత్మకంగా నిర్వహించాలని భట్టి పిలుపు

కలం, వెబ్ డెస్క్: జూన్ 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించే “రైతు ఆశీర్వాద సభ”ను మధిర శాసనసభ నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, చారిత్రాత్మక సభగా నిర్వహించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులను సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఈ సభ నిర్వహిస్తున్నారు.

ఈనెల 30న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా చింతకాని మండలంలో అత్యంత అనువైన స్థలాలను భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌లతో కలిసి పరిశీలించి సభ ఏర్పాట్లపై వివరంగా చర్చించారు. చింతకాని మండలం జగన్నాధపురం క్రాస్ రోడ్డు వద్ద మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించి సభా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

మైక్రో ప్లానింగ్ చేయాలి..

రైతులు, ప్రజలకు రవాణా సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మైక్రో ప్లానింగ్’ చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు. ప్రతి బూత్‌లో 100 మంది జనాభాకు ఒక ఇన్‌ఛార్జీని నియమించి, పేరు, ఫోన్ నంబర్‌తో సహా ఖచ్చితమైన జాబితా సిద్ధం చేయాలన్నారు. ఆరు ప్రత్యేక కమిటీలు (మండల ఆర్గనైజింగ్, వాహనాల పర్యవేక్షణ, ప్రచారం, మీడియా, మంచినీటి సదుపాయాలు, వాలంటీర్ల కమిటీలు) ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థపై మాత్రమే ఆధారపడకుండా కాంగ్రెస్ వాలంటీర్లు గేట్ల వద్ద బాధ్యతలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న మొదటి భారీ బహిరంగ సభ ఇది. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన మన ప్రాంతం నుంచి రాష్ట్రంలోని కోట్లాది రైతులకు ఒక్క క్లిక్‌తో నిధులు విడుదల చేసే ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులందరూ ఈ సభకు హాజరవుతారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చి, రైతు సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను రాష్ట్రానికి బలమైన సందేశం ఇవ్వాలి” అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>