Mobile Popup Ad
Mobile Popup Ad

మంటగలిసిన మానవత్వం.. మృతదేహాలను అద్దె ఇంటికి రానివ్వకుండా తాళం

కలం, ఖమ్మం బ్యూరో : విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కళ్లముందే మూడేళ్ల పసికందుతో సహా భార్యాభర్తలు శవాలుగా మారితే… ఆ పుట్టెడు దుఃఖంలో ఉన్న బంధువులను ఓదార్చాల్సింది పోయి, కనీసం కడసారి చూపుకైనా ఆ మృతదేహాలను ఇంట్లోకి రానివ్వకుండా అద్దె ఇంటి యజమాని తాళం వేసుకున్నాడు. భద్రాచలం (Bhadrachalam) లో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన, సమాజంలో రోజురోజుకూ మంటగలిసిపోతున్న మానవత్వానికి నిలువెత్తు అద్దం పడుతోంది. ​ఈ గుండెలను పిండేసే విషాద గాథకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

​ఒకే ప్రమాదం… మూడు ప్రాణాలు బలి

​భద్రాచలం వెంకటేశ్వర కాలనీకి చెందిన దూడల సాయి ప్రకాష్ (25), సంధ్య (22) దంపతులకు ఇద్దరు కుమారులు. ఇటీవల హైదరాబాద్ నుంచి ములకలపల్లి గ్రామానికి వచ్చిన బంధువులు తమ ఇంటికి రావాల్సిందిగా సాయి ప్రకాష్ కుటుంబాన్ని ఆహ్వానించారు. దీంతో సాయి ప్రకాష్, తన భార్య సంధ్య, చిన్న కుమారుడు మోక్షిత్ (3), తల్లి జ్యోతితో కలిసి కారులో ములకలపల్లి వెళ్లారు. ​ఆదివారం నాడు తిరుగు ప్రయాణంలో మాధారం అటవీ ప్రాంతానికి రాగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో సాయి ప్రకాష్, సంధ్య, మూడేళ్ల పసికందు మోక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన తల్లి జ్యోతి ప్రస్తుతం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

​పాల్వంచలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం, సోమవారం నాడు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహాలను భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలోని వారి అద్దె ఇంటికి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ​ఆందోళనతో బంధువులు, స్థానికులు ఇంటి యజమానికి ఫోన్ చేయగా… ఆయన చెప్పిన సమాధానం విని అందరూ ముక్కున వేలేసుకున్నారు. మృతదేహాలను ఇంట్లోకి తీసుకురావడానికి ఆయన ఎంతమాత్రం అంగీకరించలేదు.

సాయి ప్రకాష్ తండ్రి శ్రీనివాస్ (విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్) ఆరు నెలల క్రితమే గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు ఒకే కుటుంబంలో మరో ముగ్గురు చనిపోవడం ‘అరిష్టం’ అని, ఈ శవాలను ఇంట్లోకి తెస్తే భవిష్యత్తులో ఈ ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోరని సదరు యజమాని భావించి ఈ అమానవీయ చర్యకు పాల్పడినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​సొంత ఇంటికి దూరమై, అద్దె కొంపలో ఉన్నామన్న కారణంతో… కళ్లముందే ఉన్న ముగ్గురి మృతదేహాలను రోడ్డుపైనే ఉంచాల్సి రావడం బంధువులను తీవ్రంగా కలచివేసింది. యజమాని కఠినత్వానికి నిరసనగా, చేసేదేమీ లేక కన్నీటి పర్యంతమవుతూ ఆ ముగ్గురి మృతదేహాలను అదే అంబులెన్స్‌లో పురుషోత్తపట్నం తరలించారు. ​ఆరు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు, కోడలు, మనవడిని కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరుకుంది. మనుషుల ప్రాణాల కంటే, ఆఖరి చూపు కంటే… మూఢనమ్మకాలు, సొంత లాభాలే పరమావధిగా బతికే ఇలాంటి స్వార్థపరుల మధ్య మానవత్వం మూగబోక ఏం చేస్తుంది? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>