Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో రియల్ ధమాకా.. హాట్ కేకుల్లా హౌసింగ్ బోర్డు ప్లాట్లు

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda)  పట్టణంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నల్లగొండ-దేవరకొండ రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో వాణిజ్య అవసరాల కోసం కేటాయించిన ప్లాట్లు సోమవారం జరిగిన బహిరంగ వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి వివాదాలు లేని స్థలాలు కావడం, నల్లగొండ (Nalgonda) ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో కొనుగోలుదారులు ఈ ప్లాట్ల కోసం భారీగా పోటీ పడ్డారు. ఈ కాలనీలోని మొత్తం 31 ప్లాట్ల విక్రయానికి సంబంధించి హౌసింగ్ బోర్డు గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన బహిరంగ వేలానికి వ్యాపారులు, రియల్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 201 మంది బిడ్డర్లు ఈ వేలం పాటలో పాల్గొన్నారు. 233 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లకు హౌసింగ్ బోర్డు అధికారులు చదరపు గజానికి కనీస ధర రూ.20వేలుగా నిర్ణయించారు. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా బిడ్డర్లు పోటీ పడటంతో అన్ని ప్లాట్లు కనీస ధర కంటే దాదాపు 3 రెట్లు అధిక ధరకు అమ్ముడయ్యాయి. ఈ వేలంలో తక్కువగా చదరపు గజానికి రూ. 55,500 పలకగా.. గరిష్టంగా చదరపు గజం ధర రూ. 75,500 మార్కును తాకింది. మొత్తం మీద ఈ కాలనీలో విక్రయించిన ప్లాట్లకు సగటున చదరపు గజానికి రూ. 61,000 చొప్పున ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 31 ప్లాట్ల బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి, హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 44.15 కోట్ల భారీ ఆదాయం సమకూరిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. ఈ ప్రాంతానికి ఉన్న భవిష్యత్తు డిమాండ్, క్లియర్ టైటిల్ (వివాదాలు లేకపోవడం) వల్లే ఇంతటి భారీ స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నల్లగొండలో ఈ స్థాయిలో ప్రభుత్వ ప్లాట్లకు ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>