కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేస్ 2, తెలంగాణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మెట్రోకు రావాల్సిన ఐఆర్ఎఫ్సీ రుణంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్ల రుణం ఆగిపోయినట్లు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. ఇది వెంటనే మంజూరు చేస్తే.. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. రుణం ఆగిపోవడానికి గల కారణాలు పరిశీలిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
ఎట్టకేలకు ఇద్దరు ఒకే చోట..
హైదరాబాద్ మెట్రో అంశంతో సహా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల్లో జాప్యానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే కారణమంటూ కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకపడుతున్నారు. రాష్ట్రంపై బాధ్యత ఉంటే.. తనతో పాటు కేంద్ర మంత్రులను కలిసేందుకు రావాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా, తాను మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటానని.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని కూడా కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాశారు. దీంతో ఇద్దరు కలిసి రైల్వే మంత్రితో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

