కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద ప్రారంభమైన ‘బసవతారకం (Nandamuri Balakrishna) క్యాన్సర్ హాస్పిటల్ విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆస్పత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థను నేడు దేశంలోనే నెంబర్ వన్ క్యాన్సర్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడం గర్వకారణంగా ఉందన్నారు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన రోగుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ధైర్యాన్ని నింపడమే తమ సంస్థ అసలైన విజయమన్నారు. కోలుకున్న వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వే తమకు నిజమైన పురస్కారమని బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎమోషనల్ అయ్యారు.
గడిచిన పాతికేళ్లలో ఎందరో పేద, ధనిక రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో ప్రతిరోజూ సగటున 35 నుంచి 40 సర్జరీలు, 200 మందికి పైగా రోగులకు కీమోథెరపీ, అలాగే రోజుకు దాదాపు 500 మందికి రేడియేషన్ సేవలు సేవలందిస్తోంది. ఇప్పటివరకు 3.75 లక్షల మందికి పైగా బాధితులకు ఉచితంగా నాణ్యమైన వైద్య చికిత్సలను అందించినట్లు బాలకృష్ణ వెల్లడించారు. నిపుణులైన వైద్యుల బృందంతో భవిష్యత్తులోనూ క్యాన్సర్ రహిత సమాజం కోసం బసవతారకం ఆసుపత్రి మరింత విస్తృతంగా సేవలందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

